పరీక్షలు – పిల్లలు – సృజనాత్మకత

ఉపాధ్యాయ లోకం తల్లితండ్రుల లోకం పిల్లల మనస్తత్వ శాస్త్రము

‘పరీక్షలు’… మన దృష్టిలో ఇవి పిల్లల్ని బయపెడతాయి. పిల్లల్ని బడి నుంచి దూరంగా తరిమివేస్తాయి. కానీ ‘పరీక్ష’లను ‘పరీక్ష’లుగా కాకుండా ఓ ‘విభిన్న’ కోణంలో చూడగలికితే అసలు పరీక్ష అంటే ఏమిటో తెలుస్తుంది… పరీక్ష యొక్క అవసరం తెలుస్తుంది… పరీక్షలను పిల్లలు ఎంతగా ఇష్టపడతారో అర్థమవుతుంది. పరీక్షలకు, పిల్లలకు మధ్య ఎల అవినాభావ సంబంధం తేటతెల్లమవుతుంది.

 

నమ్మశక్యంగా లేకపోయినా ఇది ఓ కఠోరమైన వాస్తవం. అసలు ఇప్పటి పిల్లలు పరీక్షలను ఇష్టపడుతున్నారు. పరీక్షల ద్వారా తమ వాస్తవ స్థాయిని తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. పిల్లలకు అమితమైన స్వేచ్ఛ ఇచ్చిన పాఠశాలల్లో అయితే మాకు పరీక్షలెప్పుడు పెడతారు? అని ఉపాధ్యాయులను మహీ నిలదీస్తున్నారు.

 

అయితే ఇది ఎలా సాధ్యం?.. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలంటే దానికన్నా ముందు అసలుపరీక్షలంటే పిల్లలకు ఎందుకు భయమో తెలుసుకోవాలి. అసలు మనమంతా అనుకున్నట్లు పిల్లలు పరీక్షలంటే ఏమాత్రం భయపడడం లేదు. వాస్తవానికి వారు భయపడుతున్నది పరీక్ష రాయడానికో… పరీక్షలకు చదవడానికో కాదు. కేవలం పరీక్షకు ముందు తరువాత ఏర్పడుతున్న పరిస్థితులకే.

 

దీన్ని విపులంగా చెప్పాలంటే… సాధారణంగా టీచర్లుగా మనలో చాలామంది చేసే పని పరీక్ష పెట్టోబోయే ముందు పరీక్షలో ఎవరికైనా మార్కులు తగ్గాయో వాళ్ల పని పడతా! అని పిల్లలను హెచ్చరిస్తుంటాం. కొన్ని సందర్భాలలో బెదిరిస్తాం కూడా… పిల్లలకు వాస్తవానికి పరీక్షలంటే భయం లేదు. కానీ పరీక్షకు ముందు ఇలా టీచర్లు చేసే హెచ్చరికలంటే భయం.. మార్కలు తగ్గితే ఏర్పడబోయే పరిస్థితులంటే భయం. మార్కులు తగ్గితేఉపాధ్యాయుడు తిట్టబోయే తిట్లంటే భయం. చివరికి ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు వీరివైపు హేళనగా చూసే చూపులంటే భయం. మరి అలాంటప్పుడు పరీక్షలో విజయం సాధించలేని పిల్లు ప్రత్యామ్నాయంగా వైఫల్యాన్నే కోరుకుంటారు కదా! (జోన్ హోల్ట్ గారి పరిశీలన)

 

ఇలాంటిహెచ్చరికలు, బెదిరింపులు, అవహాళనలు, మార్కుల ప్రాతిపదికలు లేని పరీక్షలంటేనే పిల్లలకు ఇష్టం. ఇలాంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పరీక్షలు జరిగితేనే పిల్లలు తమ అసలైన స్థాయిని తెలుసుకోవాలనుకుంటారు. తమలోని సృజనాత్మకతను ప్రతి అక్షరంలోనూ ప్రదర్శించడానికి ఆరటపడతారు.

పిల్లలలో ఉన్న ఈ ఆరాటాన్ని సృజనాత్మకతను గుర్తించడానికి మేము ఇటీవల ఓ ప్రయత్నం చేశాం. బాలల దినోవత్సవ సందర్భంగా ప్రతి పాఠశాలలోని 4,5 తరగతుల పిల్లలకు టాలెంట్ టెస్ట్ నిర్వహించాలని అనుకున్నాం. ఈ పరీక్షకు ప్రాథమికంగా క్రింది లక్షణాలు ఉండాలని నిర్ణయించాం.

 

పరీక్షలోని ప్రశ్నలు నిజజీవిత వినియోగానికి అతి దగ్గరగా ఉండాలి.

పిల్లలు వారంట వారుగా చదివి అర్థం చేసుకుని, వ్రాయగలిగేతం వీలుగా, సరళంగా ఉండాలి.

పరీక్ష ఏ స్థాయికి తగిన పిల్లలను, ఆ స్థాయిలోనే నిలబెట్టగలిగేట్లు ఉండాలి.

పిల్లల భాషా పటిమకు, సృజనాత్మకతకు లీలైనంత అవకాశం ఇచ్చే ప్రశ్నలుండాలి.

 

ఈ లక్ష్యాలకు అనుగుణంగానే 60మార్కులతో ప్రశ్నాపత్రం తయారు చేశాం. తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానికి ఒక్కొక్క దానికి 20 మార్కులు కేటాయించాం. ఈ పరీక్షకు వివిధ సూళ్ళకు చెందిన 45 మంది పిల్లలు హాజరైనారు.

 

పరీక్షానంతరం పిల్లలను, వారి టీచర్లను విడిగా ఇంటర్వ్యూ చేశాం. పరీక్ష చాలా సులభం. పరీక్షంటే అసలు ఇలాగే ఉండాలి ఇలాంటి పరీక్షలైతే ఎన్నైనా రాస్తాం అన్నారు పిల్లలు ధీమాగా. కానీ టీచర్లు మాత్రం పరీక్ష చాలా కష్టం. దీనిలో టెక్ట్స్ బుక్ కంటెంట్ ఏమీ లేదు. పిల్లలు దీన్ని రాయలేరు అన్నారు.

 

కానీ టీచర్లు అనుకున్నట్లు జరగలేదు. పిల్లలు ఆ పరీక్షకు అద్భుతంగా రాశారు. అత్యంత సృజనాత్మకంగా రాశారు. సముద్రం – వెన్నెల – ఆకాశం పదాలనుపయోగించి ఒక అందమైన వాక్యం రాయండి అన్న ప్రశ్నకు రాజేశ్వరి అనే అమ్మాయి ఇలా వ్రాసింది. ఆకాశంలో వెన్నెల కాసే చంద్రుడు సముద్రంలో ఎగిరిపడుతున్న అలలను చూసి సంతోషించాడు. అసలు ఎంత అద్భుతమైన వాక్యం ఇది! మనం ఆ స్థాయి పిల్లలలో ఇంత సృజనాత్మకత, భాషా పటిమను ఊహించగలమా!

 

ఒక రాజేశ్వరియే కాదు… అందరూ పిల్లలూ ఈ ప్రశ్నకు జవాబు రాశారు. ఏ వాక్యమూ ఒకటిగా లేదు. కానీ అన్నీ అందంగానే ఉన్నాయి. సృజనాత్మకంగానూ ఉన్నాయి.

 

అలాగే మరొక ప్రశ్న ఇల్లంతా నాకి మూల కూర్చునేది ఏది? అన్న పొడుపు కథకు ఇద్దరు పిల్లలు కుక్క అని రాశారు. కాదని మనం అనగలమా?

ఉపాయానికి వ్యతిరే పదం ఏది? గొప్ప అనే అర్థాన్నిచ్చే మరొక పదం ఏది? అన్న ప్రశ్నలు మాత్రం ఎవ్వరూ రాయలేకపోయారు. దీనికి కారణం ఈ ప్రశ్నలు సిలబస్లోనివికావడమేనేమో?

 

మా పరీక్ష కథ ఇంటితో ఆగలేదు. సముద్రం వెన్నెల ఆకాశం పదాలతో అందమైన వాక్యాలు రాసిన పిల్లలు పాఠశాలలకు వెళ్ళాం. ముందుగా రాజేశ్వరినే కలిశాం. మంచి వాక్యం రాశావు నువ్వు. పరీక్షలో ఏ వాక్యం రాశావో ఓసారి పలకలో రాసి చూపించు అని అడిగాం. కాసేపటికి ఆ అమ్మాయి పలకలో కాదు పది వాక్యాలున్నాయి. అన్నీ అందంగానే ఉన్నాయి. ఒక దానితో ఒకటి సృజనాత్మకతతో పోటీపడుతున్నాయి. రాజేశ్వరి పలక ఇస్తూ ఇందులో పరీక్షలో నేను రాసిన వ్యాక్యం ఏది సార్? అని మమ్మల్నే తిరిగి ప్రశ్నించింది కానీ విచిత్రం. ఆ పది వాక్యాలలో ఆ అమ్మాయి పరీక్షలో రాసిన వాక్యమే లేదు.

 

ఈ ప్రయత్నంలోని ఈ అనుభవం మాకొక పాఠం నేర్పింది. కొన్ని అంశాలను సుస్పష్టం చేసింది.

పిల్లలలో అద్భుతమైన సృజనాత్మకత ఉంటుంది.

ఈ సృజనాత్మకత పిల్లల్లో అనేక రూపాలలో ఉంటుంది. పరిస్థితులను బట్టి వివిధ రూపాలలో బహిర్గతమవుతుంది.

ఉపాధ్యాయులు దీన్ని వెలికితీసే ప్రయత్నం చేసి, వీలైనంత ఎక్కువ అవకాశం పిల్లలకు కల్గించాలి.

సృజనాత్మకతను వెలికి తీయడంలో పరీక్షలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

పరీక్షలు సహజంలగా, సృజనాత్మకంగా, అనుప్రయుక్తంగా నిర్బంధ రహితంగా ఉన్నంతవరకూ పిల్లలు వాటిని ఇష్టపడతారు.

అలాకాకా పరీక్షలు కృతకంగా, నిర్బంధయుతంగా, మార్కుల ప్రాతిపదికగా మారితే పిల్లలు పరీక్షలను అసహ్యించుకుంటారు. మోయలేని భారంగా భావిస్తారు.

పరీక్షలంటే ఇలా ఉండాలి. పరీక్షలు ఇలా ఉంటేనే మేం వాటిని ఇష్టపడతాం. పరీక్షల ద్వారా సృజనాత్మకంగా వికసిస్తాం. అని మన పిల్లలే మనకు నేర్పుతున్నారు. అని మనం గ్రహించేందుకు ఈ అనుభవం చాలదూ!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *