ఉపాధ్యాయుడికి రాసిన ఉత్తరం .. ఔరంగజేబు

ఉపాధ్యాయ లోకం తల్లితండ్రుల లోకం

(ఔరంగాజేబులో ఎన్ని దుర్గుణాలున్నప్పటికీ అతడు గొప్ప విద్వాంసుడని చెప్పక తప్పదు. అతనికి భాషా పాండిత్యమూ, లౌకిక వ్యవహార జ్ఞానమూ, దూరదృష్టీ ఉన్నాయి. అతని అక్షరాలు ముత్యాలు దొర్లినట్లుంటాయి. తన వద్దకు పంపబడిన ముఖ్యమన అర్జీలన్నిటికీ అతడే స్వహస్తాలతో ప్రత్యుత్తరాలు రాసేవాడు. అతనికి చిన్నతనంలో చదువు చెప్ాపిన ముల్లాసాలే అనే ఉపాధ్యాయుడు తనకు గొప్ప ఉద్యోగము ఇవ్వమంటూ అర్జీ పంపితే అందుకు ఔరంగజేబు ఈ విధంగా ప్రత్యుత్తరం రాశాడు. విల్ డ్యురంట్ అనే ప్రసిధ్ద చరిత్రకారుడు మొఘల్ ఆస్థాన విశేషాల గురించి రాస్తూ చరిత్రలోని గొప్ప ఉత్తరాలలో ఇది ఒక ఉత్తరం అని ప్రశంసించాడు. కొమర్రాజు లక్ష్మణరావుగారు మొదటి ఈ ఉత్తరాన్ని ఆంధ్రపత్రకి 1910 సాధారణ సంవత్సరాది సంచికలో వెలువరించారు.)

అయ్యా! నా నుంచి మీరు ఏమి ఆశిస్తునా్నరు? ఒక ప్రముఖ ముస్లిం ప్రభువుగా నా ఆస్థానంలోకి మిమ్ములను స్వీకరించవలసిందిగా మీరు అడగటంలో హేతుబద్ధత ఏమైనా ఉందా? నాకు మీరు చదువు నేర్పవలసిన పద్ధతిలో నేర్పివుంటే పై కోరిక న్యాయబద్ధంగానే ఉండేది. మంచి విద్యను, బోధనను పొందిన విద్యార్థి తన గురువును తన తండ్రిని గౌరవించేంతగా గౌరవించాలి.

కాని మీరు నాకు నేర్పిందేమిటి? ముందుగా యూరప్ అంటే పోర్చుగల్ అనే చిన్న ద్వీపమనీ, ఆదేశపు రాజే గొప్పవాడనీ, ఆయన తర్వాతస్థానం హాలెండ్ రాజనీ అటు తర్వాత స్థానం ఇంగ్లాండ్ రాజుదనీ నేర్పారు. ఫ్రాన్సు, స్పెయిన్ దేశపు రాజులు మనదేశంలోని చిన్న చిన్న రాజువంటివారనీ, హిందూస్థాన్ రాజులు వీరందరి కంటే గొప్పవారని, ప్రపంచాన్నే జయించిన చక్రవర్తులనీ, హిందూస్థాన్ రాజులు పేర్లు వింటనే పర్షియా, ఉజ్బెక్, తార్తర్, చైనా, పశ్చిమ చైనా రాజులు గజ గజ వణికిపోతుంటారని చెప్పారు ఆహా! ఎంత ప్రశంస నీయమైన భూగోళశాస్త్రం నేర్పారండీ మీరు! దీనికి బదులుగా మీరు నాకు ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల గురించి, వాటి వైవిధ్యాల గురించి నేర్పి ఉండాల్సింది. ఆయా దేశాల రాజుల బలా బలాలూ, వారి యుద్ధ పద్ధతులూ, వారి ఆచారాలు, వారి మతాలు, ప్రభుత్వ పద్ధతులూ, వారి ప్రయోజనాలూ, వారి చరిత్ర, వారి అభివృద్ధి, అభ్యుదయమూ, పతనమూ, ఏయే ప్రమాదాల వల్ల లేక తప్పిదాల వల్ల ఆయా సామ్రాజ్యాలలో, రాజ్యాలలో మహత్తరమైన మార్పులు, విప్లవాలు వచ్చాయో – ఇవన్నీ మీరు నాకు నేర్పించి ఉండాల్సింది.

మొగల్ సామ్రాజ్య సంస్థపకులైన ప్రముఖుల గురించి మీ నుండి నేను ఏమి నేర్చుకోలేదు. వారి జీవితచరిత్రలు మీరు నాకు బోధించలేదు. మహత్తర విజయాలు సాధించటానికి వారు అనుసరించిన విధానాలు, వాటి క్రమం గురించి మీరు నాకు నేర్పలేదు.

నేను అరేబియన్ భాషను చదివేట్లు, రాయగల్గేట్లు చేయాలని మీరు అనుకునా్నరు. పది పన్నెండేళ్ళు పాటు శ్రమిస్తేగాని పరిపూర్ణత సాధించలేని ఆ భాష నేర్పడానికి మీరు నా సమయమెంతో వృధా చేశారు. ఈ ఊహలో ఒక రాజు కొడుకు గొప్ప భాషావేత్త, వ్యాకరణ శాస్త్రవేత్త అయితే అదొక గొప్ప కాబోలు! తన మాతృభాషనూ, ప్రజల భాషను, పొరుగు భాషను నేర్చుకోకుండా ఇతర భాషలు, విధేశీ భాషలు నేర్చుకోవడమనేది గౌరవాన్నిస్తుంది. కాబోలు! నిజానికి ఆ భాషలు అతనికి అవసరం లేదు. ఎన్నోబాధ్యతాయుతమైన విషయాలను పట్టించుకోవలసిన రాజవంశానికి చెందిన మాకు బాల్యదశలో సమయమెంతోవిలువైనది.మాకున్న పరిమిత సమయంలో వివిధ విషయాలు నేర్చుకోవడం అవసరం. సుదీర్ఘకాలంపాటు విసుగుపుట్టించే విధంగా అరబ్బీ భాషను నేర్పడంలో మీరు సమయమెంతో వృధా చేశారు. ఆ అరబ్బీ భాషాభ్యసనం నా జీవితంలో ఒక విషాదకరమైన ఘట్టం. అది ఒక పనికిరాని కార్యక్రమం. ఎంతో అయిష్టతతో కొనసాగిన కార్యక్రమం అది. నా మేధస్సును మొద్దుబార్చింది కూడా. (పర్షియన్ ఆనాటి రాజభాష అను.)

సక్రమమైన దారిలో నడిచిన బాల్యదశ ఎన్నో ఆనందదాయకమైన జ్ఞాపకాలతో నిండి ఉంటుందని, ఎన్నో వేల మంచి పద్ధతులనూ, విషయాలనూ నేర్చుకునే శక్తి కలిగి ఉంటుందనీ, వాటిన్నింటి ప్రభావం మనిషి జీవితంపై ఉంటుందనీ మానసికంగా అతడు ఎన్నో ఉత్కృష్ట కార్యక్రమాలు చేపట్టగలడనీ మీకు తెలియదా! చట్టాలు, ప్రార్థనలు, శాస్త్రాలు – ఇవన్నీ అరబిక్ భాషలో కాకుండా మన మాతృభాషలో నేర్చుకోకూడదా?

మీరు నా తండ్రి షాజహానులతో నాకు తత్త్వశాస్త్రాన్ని బోధిస్తానని చెప్పారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఎన్నో ఏళ్ళపాటు నా మనసును సంతృప్తి పరచలేదని వివిధ విషయాలపై మీరు నాకు మిడిమిడి జ్ఞానాన్ని అందించారు. అదంతా మానవ సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడని ఊహత్మకమైన పనికిరాని భావనలే. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.. మరిచిపోవడం చాలా తేలిక.

ఆ రకమైన తత్త్వశాస్త్ర విద్య ఎంతకాలం నేర్పారో చెప్పలేను. తెలివిగల వారిని కూడా ఆశ్చర్యపరిచి గందరగోళ పరిచే అనాగరికమైన వికృతమైన పదసముదాయం మాత్రమే మీరు నేర్పినదానిలో ప్రస్తుతం గుర్తున్నాయి. మీలాంటి అజ్ఞానాహంకారం గలవారు, తమ దుర్గుణాలను కప్పిపుచ్చుకోవడానికి అలాంటి పదాలను సృష్టించి వుంటారు. ఆ పదాల పటాటోపం చూసి మీకు ఎంతో తెలుసు. మీరు సర్వజ్ఞులు అని మేము భ్రమించాలి. ఆ అర్థంకాని అస్పష్టమైన, మార్మిక పదాల వెనుక ఎంతో అద్భుతమైన అర్థం నిగూఢంగా ఉందనీ, అధి మీలాంటి పండితులకే అర్థమవుతుందనీ మేము భావించాలి!

నిజానికి మీరు నన్ను హేతుబద్ధ ఆలోచన గలవానిగా తీర్చిదిద్ది ఉంటే హేతువుతోతప్ప మరేదానితో సంతృప్తి పొందేవానిగా రూపుగద్ధితుకొనివుంటే అదృ,్ణ, దురదృ-ష్టాల దాడులకు లోనుగాకుండా వీటికతీతంగా ఉంటానికి అనువైన సూత్రాలను నేర్పి వుంటే, నన్ను ఒక స్థితప్రజ్ఞునిగా తయారు చేసి ఉంటే సంపదకు పొంగిపోయేవానిగానమూ, కష్టాలకు కృంగిపోయేవానిగాను, కూకుండా తయారుచేసి వుంటే మనజీవితం గురించిన జ్ఞానం నాకిచ్చివుంటే, అసలు విషయాలకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు చెప్పివుంటే ఈ విశ్వం యొక్క ఔన్నత్యం గురించి నా మనసులో ఒక భావన నింపడంలో సహాయపడి ఉంటే ఈ విశ్వంలో ఉన్న ఒక క్రమం, ఒక క్రమబద్ద గమనం గురించి చెప్పి ఉంటే ఇటువంటి విషయాలతో కూడిన తత్త్వశాస్ర్తంతో నన్ను నింపి ఉంటే నేను అలెగ్జాండర్ తన గురువైన ఆరిస్టాటిల్ పట్ల చూపిన ఆదరణ మీ పట్ల చూపించేవాడిని, అంతకంటే ఎక్కువగా మీకు సహాయం చేసి ఉండేవాడిని.

మీరు నన్ను అనవసర పొగడ్తలతో ముంచెత్తకుండా రాజుగా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను నేర్పి ఉండాల్సింది. ఒక పరిపాలకునికి ప్రజల పట్ల గల బాధ్యతలనూ, ప్రజలకు పాలకుని పట్ల గల బాధ్యతల గురించి అవగాహన నాకు నేర్పి ఉండాల్సింది. ఏదో ఒక రోజు నా సోదరులుతోయుద్ధం చేయడానికి కత్తి ఉపయోగించాల్సి వస్తుందని ఊహించి ఒక పట్టణాన్ని ఎలా ముట్టడించాలి, చెల్లాచెదురయిన సైన్యాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి అన్న విషయాలు నేర్పించాల్సింది. అయితేఇవన్నీ నేను ఇతరుల నుండి ఆ తరువాత నేర్చుకున్నాను. మీ వద్ద కాదు.

 

కనుక మీరు ఇప్పుడు ఉంటున్న గ్రామానికే వెళ్ళిపొండి. మీకు నేను ఎటువంటి సహాయమూ చేయను. మీరు ఎవరో, ఏమిటో ప్రజలకు తెలియకుండా ఒక సాధారణ పౌరునిగా ఎప్పటిలాగానే జీవించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *