పుస్తక పరిచయం – నయీ తాలిం 

ఉపాధ్యాయ లోకం బ్లాగ్ రిసోర్స్ సెంటర్

పుస్తక పరిచయం :

నయీ తాలిం  –  మార్జరి సై క్స్ (Marjorie Sykes)

నయీ తాలిం  అంటే “నూతన విద్య” అని అర్ధం. దక్షిణ ఆఫ్రికాలో “టాల్ స్టాయ్” క్షేత్రంలో  గాంధీజీ మొట్టమొదటిగా తన విద్యా ప్రయోగాలను ప్రారంభించారు. ఆతర్వాత భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1937 లో హరిజన పత్రికలో తన నూతన విద్య ప్రణాళికను ప్రతిపాదించాడు.

మార్జరి సైక్స్ (1905-1995) బ్రిటిష్ మహిళ.  ఆమెకు నయీ తాలిం మొదలైనప్పటినుండి పరిచయం ఉంది. స్వయంగా ఆమె గాంధీజీ తోను, నయీ తాలిం విద్యా వ్యవస్థను అనుసరిస్తూ పనిచేశారు.  ఆమె ఒక ఉపాధ్యాయుని కుమార్తె. తన కళాశాల విద్యను పూర్తి చేసుకోగానే 1927లో అప్పటి మద్రాసులోని బెంటింగ్ కాలేజ్  లో ఉపాధ్యాయురాలుగా తన ప్రస్తానాన్ని ప్రారంభించారు.  అప్పటినుండి 1991 వరకు ఆమె భారత దేశంలోనే ఉండిపోయారు. 1988 లో  నయీ తాలిం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్భంలో ఆమె ఈ పుస్తకాన్ని రాశారు.

మనకు గాంధీజీ ఒక కోణం నుంచే తెలుసు. అయితే ఆయన ఒక విద్యావేత్తగా చాలా కొద్ది మందికే తెలుసు.  రవీంద్రనాథ్ ఠాగూర్ లాగే గాంధీజీ కూడా భారతదేశంలో బ్రిటిష్ వారి విధ్యా  విధానాన్ని పూర్తిగా తుడిచి పెట్టి భారత దేశానికి ఒక నూతన విధ్యా  విధానాన్ని అందివ్వాలని కలలు కన్నారు. గాంధీజీ నయీ తాలిం ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రణాళికలు, ఆచరణలు, దాని వైఫ్యల్యాలు ఈ పుస్తకంలో విపులంగా చర్చిస్తారు మార్జరి సై క్స్.

ఈ పుస్తకంలో ఆమె ముందు మాటలో, “జరిగిందానికి సంభందంలేని వ్యక్తి ఒక విషయాన్ని  వివరించేదానికంటే, తన అనుభవాలతో వ్యక్తిగతంగా రాసే విషయమే వాస్తవాలకు దగ్గరగా  ఉంటుంది.”  అంటారు.  నిజమే ఆమె ఈ పుస్తకంలో తన అనుభవాలను సజీవంగా మనకు అందించారనిపిస్తుంది.  నయీ తాలిం మీద ఈ పుస్తకం ప్రస్తుత కాలానికి భారత దేశానికి ఎంతో అవసరమని ఆమె అభిప్రాయ పడ్డారు. రానున్న 50 సంవత్సరాల కాలంలో  గాంధీజీ ప్రతిపాదించిన ఈ సృజనాత్మక విద్యా  విప్లవాన్ని చర్చించాలంటారు. అయితే ఆమె ఈ మాట చెప్పినప్పటినుండి 33 ఏళ్లు గడచిపోయాయి.  మనం మాత్రం మన విద్యా  రంగం విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే  ఉన్న చందాన ఉన్నాము.

“గాంధీజీ ఆలోచనలు నాకు ఆకాశం నుంచి ఊడిపడలేదు, మా ఇంట్లో సహాజసిద్ధంగా వంట, పరిశుభ్రత వంటి రోజువారీ పనులలో నా బాల్యంలో పడిన పునాదులే  కారణం” అంటారు.  “విజ్ఞాన శాస్త్ర బోధనా విషయంలో స్థానిక వనరులను ఉపయోగించాలన్న ఆలోచన భారతీయ విద్యా రంగంలో ఇప్పటికీ చోటుచేసుకోలేదు”  అంటారు.

“హరిజన పత్రికలో 1937 లో వ్యాసాలు రాసే నాటికి ముందే గాంధీజీ 40 సంవత్సరాలుగా విద్య గురించి ఆలోచిస్తున్నాడు.  ముందునుంచి కూడా గాంధీజీకి మూడు విషయాలలో స్పస్టత ఉండేది. పిల్లలు తమ మాతృభాషలోనే చదువుకోవాలి, పిల్లలను వసతి గృహాలలో ఉంచరాదు, అన్నిరకాల సామాజిక వర్గాల పిల్లలకు ఒకే రకమైన విద్య, వసతులు ఉండాలి”  అని రాస్తారు ఆమె. పిల్లలకు ఏడవ సంవత్సరం నుండి చదువు మొదలు పెట్టడానికి సరైన వయసు అనే స్పస్టత గాంధీజీకి ఉండేది అంటారు. ఇప్పుడు ఈ విధానాన్ని పిన్లాండులో ఒక ముఖ్యమైన విధానం గా అనుసరిస్తున్నారు.

ఈ నయీ తాలిం కథను ఆమె మొత్తం పన్నెండు భాగాలలో వివరిస్తారు. విద్య అని అంటున్న ఈ జీవం లేని విద్యా విధానానికి స్వస్తి పలికే రోజు ఇంకా రాలేదా అని ప్రశ్నిస్తూ, 1937 లో ఆ అవకాశం వచ్చింది అంటారు. “అక్షరాస్యత అనేది అసలు చదువుకాదు, అందుకే నేను చేతివృత్తిని నేర్పించటంతో చదువు మొదలుపెడతాను, అయితే  అవి అవి యాంత్రికంగా కాకుండా శాస్త్రీయంగా నేర్పాలి.”  “ప్రస్తుత విద్యావ్యవస్థ వ్యర్ధమైనదే కాకుండా హానికరమైనది కూడ”, విద్య అనేది కేవలం పాఠశాలలకు మాత్రమే పరిమితమైనది కాకూడదు”,  ఇలా గాంధీ నూతన విద్య గురించిన అభిప్రాయాలను ఈ పుస్తకంలో అనేక చోట్ల ప్రస్తావిస్తారు. దీనిని బట్టి మనకు గాంధీజీ భారతీయ విద్యావిధానం మార్పు పట్ల ఎంత సుధీర్ఘంగా , ఎంత ప్రగాఢంగా , ఎంత నిశితంగా ఆలోచించారో మనకు ఈ పుస్తకం ద్వారా అర్ధమవుతుంది. ఇప్పటికీ విద్య పట్ల ఆయన  ఆలోచనలు ఆచరణ యోగ్యాలేనని మనకు అనిపించక మానదు.

ఈ సంధర్భంగా ఒకచోట వినోభా భావే చెప్పిన విషయాన్ని ఈ పుస్తకంలో ఆమె ప్రస్తావిస్తారు. “ 1947 లోనే పాత జెండాను వదిలించుకున్నప్పుడే పాత విద్యా వ్యవస్థను వదిలించుకొని ఉండాల్సింది” , ఆ మాటల్లో నిజముంది అంటారు ఆమె.  1947-50 ల మధ్య జరిగిన మౌలిక విద్య మీద జరిగిన సమావేశాల గురించి చర్చల గురించి తన అనుభవాలను వివరిస్తారు.  “ప్రతి భాషను, ప్రతి సంస్కృతిని మనం మన స్వంత భాషల ద్వారానే ఆస్వాదించగలగాలి”, అప్పుడే ప్రపంచ విజ్ఞానం, సాహిత్య సంపదలు, సాధారణ ప్రజల ఆస్తులవుతాయి, అంటే ఇంగ్లీషు మీద ఏమాత్రం ఆధారపడకుండా మాతృభాష లోనే ఉన్నత విద్యను సాధించవచ్చని ఆచరణలో చూపించాలి” అని 1945లో జరిగిన సమావేశంలో చర్చల సంధర్భంగా గాంధీజీ వెలుబుచ్చిన అభిప్రాయాలను ఆమె ఇక్కడ ప్రస్తావిస్తారు.

సేవాగ్రామ్ లో జరిగిన ప్రయోగాలను, నయీ తాలిం వార్షిక సమావేశాలలో జరిగిన చర్చలు, ప్రతిపాదనలు, ఈ విధానం గూర్చి అంకిత భావంతో పనిచేసిన వారి గురించి ఆమె ఈ పుస్తకంలో కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. శరీరం, మేధా, ఆత్మ కలిపి మనిషిని మెరుగు పరుస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది.  ప్రతీ  ఒక్కరిలో మానవ సామర్ధ్యాలను వెలికి తీస్తుంది. ఈ కలను సాకారం చేయాలంటే  కొత్త రక్తం కావాలి, మా కలను, అదర్శాన్ని ముందు తరాలకు అందచేస్తున్నాం. అది నెరవేరే రోజు తప్పక వస్తుంది” అని ఆమె ఆశావహంతో ఈ పుస్తకాన్ని ముగిస్తారు. నయీ తాలిం ను మెరుగు పరుచుకొని ఆధునీకరించుకులేక పోయాం. 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం మన విద్యా  వ్యవస్థలో పిల్లి మొగ్గలు వేస్తున్నాం. విద్య-పని అనే విధానాన్ని జపాన్, ఫిన్లాండ్, ఇంకా కొన్ని దేశాలు అదర్శంగా  తీసుకొని వారి విద్యావిధానంలో అమలుచేస్తున్నాయ్. ఎప్పటికీ మనకు మాతృ భాషలో విధ్య భోదన పట్ల సదభిప్రాయం లేదు.  ఇటువంటి తరుణంలో నయీ తాలిం గూర్చి చర్చించాల్సిన అవసరం వుందని మేధావులు అందరూ గుర్తించాలి. ఇందుకు మార్జరీ సైక్ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పుస్తకాన్ని కె . సురేష్ గారు తెలుగులోకి అనువదించారు. మంచిపుస్తకం, సికింద్రాబాద్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.(

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *