కిషోరం శాంతాబాయి కాలే ఎదురీత

ఉపాధ్యాయ లోకం తల్లితండ్రుల లోకం

ఎదురీచడం బ్రతికి వున్న చే లక్షణం. ప్రవాహానికి కొట్టుకు పోవడం చచ్చిన లక్షణం అని మనం కష్టాల్లో వున్నవారికి మాటలెంతైనా చెప్పవచ్చు. కానీ ఎదురీదడం ఎంత కష్టమో, ఆ ఆలోచన రావడమే ఎంత సమస్యాత్మకమో, దానికెన్ని అడ్డంకులో అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి. ఆ అనుభవం లేకుండా గట్టున కూర్చుని మనం వాటి అర్థం చేసుకోలేం. అయినా ఆ అనుభవం ప్రాతిపదికన వాస్తవాన్ని వాస్తవంగా ఏరంగూ, రుచీ, వాసనా జోడించకుండా రాసిన గ్రంథాల్లో మనం అనుభవించని మరో జీవితాన్ని, నికృష్ట బాధమయ జీవితాన్ని మనమే ఆ పరిస్థితుల్లో వుంటే ఎలా వుండేది? అని అడుగడుగునా అన్పించేలా చూడగలం. ఏడుతరా ల్లాంటి గ్రంథాలు చదివిన తర్వాత రోజుల తరబడి మనం చలించిపోవడం మంచి పాఠకులందరి అనుభవమే. ఈ కోవకు చెందిన పుస్తకం ఎదురీత.

 

ఎదురీత ఒక విద్యార్థి జీవితం. బడిలో అడుగు పెట్టడం నుంచి మెడిసిన్ పట్టా పుచ్చుకొని బయటపడేదాకా ఎక్కడైనా ఆ విద్యార్థి చదువు అర్థాంతరంగా ఆగిపోవచ్చు. అగిపోకుండా సాగడం ఓ మహాద్భుతం. మహా వింత. అయినా అది సాధ్యమైందంటే కిషోర్ శాంతాబాయి కాళే ఎదురీదడం వల్లనే. కిషోర్ తన ఈ ఎదురీతను తన మాటల్లో ఆత్మకథగా రాసిన పుస్తకమిది.

 

కిషోర్ శాంతాబాయి కాలే అనే పేరులోనే కావల్సినంత తిరకాసువుంది. పేరు పక్కన వున్నది అమ్మపేరు. అయ్య పేరు కాదు. అసులున్నది అమ్మే. అయ్య కిషోర్‌కి లేడు. ఇలాంటి పేరు స్కూల్లో రాయించమెలా.. అక్కడితోనే మన కిషోర్ చదువు సమస్య మొదలవుతుంది. ఓ మనసున్న టీచరు పుణ్యాన తల్లి పేరుతోనే కిషోర్ రిజిష్టర్‌లోకెక్కి గండం నుంచి బయటపడతాడు.

 

కిషోర్‌ది కల్హాటి కులం. మహారాష్ట్రలోని ఈ కులం వృత్తి మొదట గారడీ. వాళ్ళ శరీర విన్యాసాలు ఈ కులంవాళ్ళను ఆటగాళ్ళుగా మార్చింది. వీళ్ళ ప్రదర్శనల్లోని స్ర్తీల నాట్యాన్ని తమాషా అంటారు. లేకుంటే జల్సా అంటారు. మత్తెక్కించే సంగీతం, వాద్యాల నడుమ ఈ కులం స్ర్తీలుగంటల తరబడి నృత్యం చేస్తారు. చప్పట్లు, కేరింతలతో పురుషపుంగవులు నీళ్ళని చూస్తూ కరెన్సీ నోట్లు అందిస్తుంటారు. వాటినిఅందుకోవడం కోసం విల్లులా ఈ నాట్యగత్తెలు వంగాల్సి వుంటుంది. ఈ పురుష పుంగవుల పాలిటికిదో అలౌకిక విలాసం. నాట్యగత్తెల పాటిల విషా భీభత్సం.

 

ఈ స్త్రీలు సంపాదించే దానిపైనే కల్హాటీకులం పురుషులు జీవిస్తారు. వాళ్ళే పనీ చేయ్యరు. ఈ స్త్రీలు ఈ పురుష పోషణను ఓ మహత్తర కర్తవ్యంగా భావిస్తారు. పురుషులు పెళ్ళడతారు గాని తమ కులపువాళ్ళని పెళ్లాడరు. తమ భార్యామణుల్ని ఈ వృత్తికి పంపరు. చెల్లెళ్ళెలని, అక్కల్ని పంపి వాళ్ళ సంపాదనతో కులుకుతుంటారు. ఈ నాట్యగత్తెల్ని కొందరు ఉంచుకొంటారు. కొందరు పెళ్ళాడతారు. వీళ్ళకి బిడ్డలు పడతారు. ఈ బిడ్డలు డోలక్‌లు కొట్టేవాళ్ళుగా, విటులకు సిగరెట్లు, బ్రాందీ సీసాలు మోసేవాళ్ళుగా, నాట్యగత్తెలకు పరిచారకులుగా మారతారు. మన కిషోరం అంలాటి ఓ పిల్లవాడు.

 

కిషోర్ బడిలో అడుగుపెడతాడు. బడిలో వూళ్లోనే వుంది. తాత గారింటిలో బండచారికీ చేస్తూ, నానా అవమానాలు భరిస్తూ అమ్మ ఇంకో అయ్యను వెతుక్కొని వెళ్ళిపోతే బిక్కు బిక్కుమంటూ చదువు ప్రారంభిస్తాడు.

 

ఇక కిషోర్ చదువు ఆద్యంతమూ మన గుండెల్ని పిండేస్తుంది. ఆ చదువు ఎక్కడాగిపోతుందో తేలీదు. పుస్తకాలు కొనిచ్చే వాళ్లు లేరు. అయినా కిషోర్ నాల్గవ తరగతి దాటుతాడు. ఇప్పటికి కల్హాటీ కుటుంబాల్లో నాల్గు తరగతులు చదివింది కిషోర్ ఒక్కడే.

 

కిషోర్‌ సెలవుల్లో పనిచేస్తాడు. పొద్దస్తమానం ఇంటి పనిచేస్తాడు. ఏ పని తగిలినా బడికి ఎగనామం తప్పదు. చాకిరీ చేసి గుడ్‌బాయ్ అన్పించుకొంటే బందువులు నాలుగు రూపాయలిస్తే వాటితో పుస్తాకలు కొంటాడు. ఆ నాలుగు రూపాయలూ తాతా తాగుడుకు లాక్కుంటే అవీ కొనలేడు. వేసవి సెలవుల్లో తమాషా నృత్యాలకు వెళతాడు. నానా అరవచారికీ చేస్తాడు. ఆ పనులు చెప్పుకొంటే సిగ్గు పొయ్యే పనులు అయినా చేస్తాడు. అప్పుడు సంపాదించిన దాంతో బడి తెరిచాక బడిలో చేరాలి. బడి దాటాక కాలేజీలోనూ అదే తంతు. అదెవరైనా చూస్తే కష్టం. అయినా తప్పదు.

 

కిషోర్ చదివిలా సాగిసాగి మొండి ధైర్యంతో మెడిసిన్ దాకా నడుస్తుంది. స్కాలర్ షిప్పులు కూడా సకాలంలో రావు. అప్పుల మీద బతకాలి. డబ్బున్న సహ విద్యార్థులు విలాసాలు, వెక్కిరింతలు సరేసరి. ఒసారి పరీక్ష తప్పిపోతాడు. ఓసారి మానేస్తాడు. ఓసారి ఆత్మహత్యకే పూనుకొంటాడు. చిట్టచివర డిగ్రీ చేతికొచ్చాక మనకు హమ్మయ్య అన్పిస్తుంది.

 

మధ్యలో కిషోర్‌ను ఆదుకొనేవి కొందరు మంచి టీచర్ల ప్రోత్సహాలు, మంచి మిత్రుల స్నేహహస్తాలు. ఆలస్యంగానైనా వచ్చే స్కాలర్ షిప్ రూకలు.

 

కిషోర్ మెడిసిన్ అయ్యాక టవున్లో స్వంత ఆసుపత్రి పెట్టలేదు. డబ్బులు గుంజడానికీ వృత్తిని చేపట్టలేదు. ఆదివాసీ ప్రాంతంలో నిరాడంబరంగా తడికెల గదినే ఆసుపత్రిగా మార్చుకొని కరెంటు కూడాలేని చోట వైద్య మొదలెట్టాడు. ఇది కిషోర్ రెండో జీవితం. డాక్టరయ్యాకనైనా అమ్మరాదు. అమ్మకు కోసం. తన బతుకంతా పుస్తకంలోకి ఎక్కించాడని కోసం. కల్హటీలందరికీ కోసం.తమ వృత్తిని బజారుపాలు చేశాడని కోసం. ఇది ఇంకో ఎదురీత. కిషోర్ దీన్నీ ఎదుర్కొన్నాడు. చివరకి అమ్మ శాంతాబాయి అతని దగ్గరికి వస్తుంది. నిరుపేదల వేద్యసేవతో కిషోరం కొత్త జీవితం మొదలవుతుంది.

 

ఈ పుస్తకం ఆద్యంతం మనల్ని ముఖ్యంగా టీచర్లని విచలితుల్ని చేస్తుంది. మన స్కూళ్ళలోని ప్రతి విద్యార్థిలోనూ ఓ కిషోర్‌ని మనకు సాక్షాత్కరింప చేస్తుంది. వాళ్ళ బ్రతుకుల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా పాఠాలు చెప్పి, పరీక్షలు రాయించి, అక్షరం ముక్క రాని వెధవలు అని ముద్ర వేసే మనల్ని గుచ్చి గుచ్చి ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది. అందుకే ప్రతి టీచరూ దీన్ని చదవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *