జ్ఞాపకం, అవగాహనా ఒకటి కావు .. ప్రొఫెసర్ యశ్పాల్

తల్లితండ్రుల లోకం

మన పిల్లలకి ఏమి నేర్పించాలి? ఎలా నేర్పించాలి? అనే దాన్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు NCERT  ప్రారంభించిన గొప్ప సామాజిక చర్చలో పాల్గొనే మహత్తరావకాశం నాకు కల్గింది. విస్తృతస్థాయిలో జరిగిన ఈ చర్చలో అనేక ఆలోచనలు, ఆకాంక్షలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎంతో మంది గొప్ప వారిని కలిసే అవకాశం నాకు కల్గింది. ఫలితంగా ఈ జాతీయ పాఠ్యక్రమ ప్రణాళిక రూపుదిద్దుకొంది.

 

ఈ క్రమంలో చాలా విశ్లేషణ జరిగింది. చాలా సలహాలు వచ్చాయి. ప్రత్యేకతల్ని పట్టించుకోవాలని, మాతృభాష చాలా కీలకమైన వాహకమని, స్వంత జ్ఞాన నిర్ణయంలో పిల్లలు సామాజిక, ఆర్థిక, జాతిపరమైన నేపథ్యాలు చాలా ముఖ్యమైనవని, మాటి మాటికి మాకు చాలా మంది గుర్తు చేశారు. ఒకవైపు మీడియా ప్రాధాన్యతతను గుర్తిస్తూనే, విద్యా బోధనలో వస్తున్న సాంకేతిక విప్లవాన్ని వొప్పుకొంటూనే, ఇప్పటికే ఉపాధ్యాయుడే కేంద్రమనేది మాత్రం అందరూ అంగీకరించారు. వైవిధ్యాల్ని గురించి నొక్కి వక్కాణిస్తూనే అవి అడ్డంకులు కావని వెల్లడించారు. సమాజం నుంచి నేర్చుకొనే విలువైన అంశాల్ని మన పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా పాఠ్యాంశాల్ని సుసంపన్నం చేయ్యవచ్చునని ఏకాభిప్రాయం వ్యక్తంమైంది. బహుళత్వం మనకు పెద్ద సంపద అని దీన్ని గురించి మన విశాల అవగాహన సృజనాత్మకత వికసించేందుకు దోహదపడుతుందని భావించిడం జరిగింది.

 

మన పిల్లలపై పాఠ్యగ్రంథాల బరువును గురించి ఈ డాక్యుమెంటు మాటిమాటికీ చర్చిస్తుంది. ఈ విషయంలో మాత్రం మనం ఓ పెద్ద అగాధంలో పడి పోయామన్పిస్తోంది. స్వల్పకాలం సమాచారాన్ని నిల్వ చేసుకొనే జ్ఞాపకాన్ని మనం అవగాహనగా పొరపడుతున్నాం. ఇది మారాలి. ఎందుకంటే కాలం మారింది. మన పిల్లలు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సమాచారం నానాటికీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. విషయాన్ని అర్థం చేసుకోవడంలోని రూచిని మన పిల్లలకు అందించాలి. ఫలితంగా వాళ్ళు ప్రపంచాన్ని జీవితాన్ని ఎదుర్కొనేప్పుడు స్వంతంగా వ్యవహరించగల్గుతారు. స్వంత జ్ఞానాన్ని పెంపొందించుకో గల్గుతారు. ఇలాంటి వారు సమగ్రమైన, సృజనాత్మకమైన, సంతోషభరితమైన వ్యక్తులుగా మారుతారు. కేవలం పరీక్షల పోటీలో తలపడేందుకు లేనిపోని సమాచారాన్నంత మెదడులో కుక్కుకోవాల్సిన భారం వాళ్ళకి తప్పుతుంది. మనమీద మనమే రుద్దుకొన్న ఈ అవరోధాన్ని అధిగమించడాన్ని గురించి ఈ డాక్యుమెంటు చర్చిస్తుంది. ఈ అంశంలో మనం ఏ కొంచెం ముందుకెళ్ళగల్గినా మన పిల్లల అభ్యసనా సామర్థ్యాన్ని గుర్తించగల్గిన వాళ్ళమవుతాం. ఎర్రసిరాతో, కంప్యూటర్ డిస్క్ బిట్స్‌తో మనం కొలిచి పిల్లల మెదళ్ళకు దట్టిస్తున్న సమాచారం ఎంత దండగమారిదో మనకు తెలిసొస్తుంది.

 

విద్య అంటే పోస్టు ద్వారానో, టీచరు ద్వారానో చేరవేసే భౌతిక వస్తువు కాదు. నిజమైన విద్య బిడ్డ భౌతిక సాంస్కృతిక క్షేత్రంలో సృష్టించబడుతుంది. నిలదొక్కుకొని ఉంటుంది. తల్లిదండ్రులతో, టీచర్లతో, తోటి పిల్లలతో, సమాజంతో నెరిపే సాన్నిహిత్యం ద్వారా అది క్రమ వికాసం పొందుతుంది. ఇలాంటి విద్య పటిష్టంగా, ఫలప్రదంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుల పాత్రను, ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి బలపరచాలి. జ్ఞాన సముపార్జన ఎప్పుడూ పరస్పరాశ్రితంగా ఉంటుంది. ఒక మంచి టీచరు పిల్లల నుంచి నేర్చుకొనేది కూడా ఎంతో ఉంటుంది. కాకుంటే టీచరు బిడ్డకు మౌనముద్ర వేసి మూగమొద్దులా కూచోబెట్టకుంటేనే ఇది సాధ్యమవుతుంది. పెద్దలకంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు. బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్నిసృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి. నాకున్న ఈ కొద్ది అవగాహనా పిల్లలతో మాట్లాడ్డం వల్లనే లభించిందని నా అనుభవంతో నేను చెపుతున్నాను. ఈ అంశాన్ని కూడా ఈ డాక్యుమెంటు విస్తారంగా ప్రస్తావించింది.

 

దశాబ్దాలకు ముందే మనం కలగన్న అనేకానేక అంశాలు అనుకొన్నట్టు జరగనందుకు మనం చింతిస్తుంటాము. నిందిస్తుంటాము, ఏదో ఒకరకంగా ఈ పరిస్థికి మనమూ బాధ్యులమేనన్న స్పృహ వల్ల కావచ్చు. ఈ నిందా క్రీడలోకి మేము దూరదలుచుకోలేదు. మధ్య తరగతి వర్గంగా మనం ఈ దేశ జన బాహుళ్యం నుంచి వేరుపడ్డాము. అందువల్లనే ఈ పరిస్థితికి మనమూ బాధ్యులమయ్యాము. బహుళత్వం సమాన న్యాయం, సమానత్వం అనే మాటలు ఇందులో మాటి మాటికీ వస్తాయి. ఇవేమి రాజకీయ ప్రచార నినాదులు కాదు. ఎందుకంటే ఇంత విస్తృతంగా చేసిన చర్చలో మేమెక్కడా రాజకీయల జోలికి పోలేదు. మన దేశంలో నాల్గింట మూడు వంతులుగా ఉన్న అధోజగత్ సోదరుల్లోనే మన బలం మన గొప్పదనం దాగివుందని మేము దృఢంగా నమ్ముతున్నాము. ఈ నమ్మకం నుంచే పై మాటాలు వచ్చాయి. సామాజిక జీవితం నుంచి పొందిన వీరి సామర్థ్యాల్ని, నైపుణ్యాల్ని మన బోధనాంశాలతో జతపరచగల్గితే అద్భుతాలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *