పిల్లలు – ప్రకృతి  — రవీంద్రనాథ్ టాగూర్

ఉపాధ్యాయ లోకం తల్లితండ్రుల లోకం పిల్లల మనస్తత్వ శాస్త్రము బ్లాగ్ రిసోర్స్ సెంటర్

పిల్లలు – ప్రకృతి  — రవీంద్రనాథ్ టాగూర్

నా అభిప్రాయం ప్రకారం చదువు నేర్పడానికి ఒక వయస్సు ఉంది. అదే బాల్యం. ఆ సమయంలో శరీరం, మనసు పెరగడానికి ప్రకృతిలో మనకు కలయిక ఉండాలి. ఎట్టి అడ్డంకులు ఉండకూడదు. అది కప్పి, మూసి పెట్టే వయస్సు కాదు. అప్పుడు నాగరికత ఎంత మాత్రం అవసరం లేదు. కానీ బాల్యంనుంచే ఈ నాగరికతతో యుద్ధం ప్రారంభమవుతూ ఉంటే నాకు చాలా దుఃఖం కలుగుతోంది.

పిల్లవాడు బట్టలు విప్పి పారేద్దామని చూస్తుంటే వాణ్ణి మనం బట్టలతో కట్టి పడేయాలనుకుంటున్నాము. ఆలోచించి చూస్తే ఈ యుద్ధం జరగడం పిల్లలతో కాకుండా మనం ప్రకృతితో చేస్తున్నామని తెలుస్తుంది. ప్రకృతిలో ఓక ప్రాచీనజ్ఞానం ఉంది. పిల్లవానికి బట్టలు తొడిగినప్పుడు ఆ జ్ఞానమే ఏడ్పుతో ప్రతిధ్వనిస్తుంది. మనమందరమూ ప్రకృతిమాత బిడ్డలం. ఏ విధంగానైనా సరే నాగరికత నుంచి కొంతమేరకు సంబంధాలు తెంచుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఏడు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు సభ్యత అనే క్షేత్రం నుంచి పూర్తిగా బయట ఉంచాలి. నిజానికి ఏడు సంవత్సరాలు కూడా చాలా తక్కువ. ఈ వయస్సు వరకు పిల్లలకు ఏ విధమైన అలంకరణ ఏవిధమైన సంకోచం అవసరం లేదు. అంతవరకు అటవిక శిక్షణ అన్నిటి కంటే అవసరమైన శిక్షణ. అందరికీ ఇది లభించాలి. ఏ ఆటంకమూ లేకుండా ప్రకృతిని, ఈ శిక్షణను అందజేయనివ్వాలి. పిల్లలను ప్రకృతి ప్రభావంలో ఉండనివ్వండి. అందులో మరే విధంగానూ, కలగజేసుకోద్దు. ఈ సమయంలో కూడా పిల్లలు ప్రకృతి ఒడిలో పడుకుని శరీరాన్ని మట్టితో పులుము కోకపోతే ఇటువంటి స్వర్ణావకాశం వారికి ఎప్పుడు లభిస్తుంది. ఈ దురదృష్టవంతులు ఈ వయసులో కూడా చెట్లెక్కి పండ్లు కోసుకోలేకపోతే నాగరికత అనే సంకోచంలో చిక్కుకుని చెట్లు పువ్వులు, పళ్ళు, కాయలు వీటితో ఎప్పటికీ సంబంధం పెట్టుకోలేరు. ఈ వయస్సులో వెలుతురు, పచ్చిక బయళ్ళు, చెట్లు, ఆకులు, పూలతో వారి మనస్సుకు శరీరానికి అతి సహజమైన ఆకర్షణ, ఆత్మీయత ఉంటాయి. ప్రకృతి నాల్గువైపుల నుంచి ఆహ్వానం ఉంటుంది. మధ్యలో మనం వస్త్రాల ద్వారా అడ్డుపెడితే పిల్లల శక్తి ప్రయాసలు ఆగిపోయి కుళ్ళిపోతాయి.

పిల్లవానికి బట్టలు తొడిగినప్పుడు ఆ బట్టలను జాగ్రత్తగా ఉంచుకోమని మరీ చెప్పాల్సి వస్తుంది. వాటిని మురికి కాకుండా ఉంచాలని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ పిల్లవానికి కూడా కొన్ని విలువలున్నాయన్న విషయం మనం మరిచిపోతాము. కాని మిషనువాడి కిచ్చిన కుట్టుకాలి మాత్రం మరిచోపం. ఆ బట్ట చిరిగినా మురికయినా ఆ రోజు ఇంత అందమైన కోటుకి అంత డబ్బిచ్చి కుట్టిస్తే దౌర్భాగ్యుడు ఎక్కడో సిరా మరక అంటించుకు వచ్చాడని ఎన్నో మాటలు అంటాం. ఈ రకమైన దండన ద్వారా ఆట పాటల కంటే ఆనందం కంటే బట్టల విషయంలో జాగ్రత్త అవసరమని నేర్పుతాం. ఏ బట్టలయితే పిల్లవానికి అవసరం లేనో వాటి బాధ్యత పిల్లవానిపై ఎందుకు పెట్టాలి? భగవంతుడు పిల్లవానికి ఎన్నో అసంఖ్యాకమైన సుకాలు ఏర్పాటు చేశాడు. వాడి మనసును దానికి అనుగుణంగా సృష్టించాడు. దానిని మనం బట్ట పట్ల మోజు అనే సంకెళ్ళలో ఎందుకు అకారణంగా బంధించాలి. ఈ మనిషి ప్రతిచోట తన అయోగ్యబుద్ధిని, చంచలమైన మానసిక శాసనాన్ని విస్తరించి ప్రాకృతిక సుఖశాంతులకు లావు లేకుండా చేస్తున్నాడు? మనకు నచ్చినది ఇతరులకు కూడా నచ్చాలన్నమాట, ఎంత వరకు సరైనది? ఈ విచిత్రమైన వాదనను ఉపయోగించి మనం ప్రపంచం నలువైపులా దుఃఖాన్ని విస్తరింప చేయడానికి నిశ్చయించుకున్నట్లు అనిపిస్తోంది.

ఏది ఏమయినా ప్రకృతి చేయగలిగినది మనం చేయలేమన్న దాంట్లో కొంచెం కూడా సందేహం లేదు. మేమే బుద్ధిమంతులం, మనిషిని ఉద్దరిస్తామనడం భావ్యం కాదు. ప్రకృతిని తన పని తాను చేయాడానికి స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. ప్రారంభం నుండి అలా చేసినట్లయితే ప్రకృతి స్వేచ్చా సామ్రాజ్యంలో ఆనందంగా తమ ఇష్టం వచ్చినట్లు తిరగనిస్తే ఈ నాగరికతతో వారికెటు వంటి జగడమూ ఉండదు. మనం అనుకున్న పని కూడా నెరవేరుతుంది. ఈ ప్రకృతి శిక్షణ వల్ల పిల్లలకే లాభం ఉందని అనుకోవద్దు. ఇందులో మన లాభం కూడా ఉంది. మనం మన చేతులతో అన్నీ మూసి పెట్టి మన స్వభాన్ని ఎంత వికృతం గా చేసుకుంటామంటే ప్రాకృతిక వస్తువులను సామాన్య దృష్టితో చూడలేం. అందమైన మానవ శరీరాన్ని మనం బాల్యంనించీ నగ్నంగా చూడడానికి అలవాటు చేసుకోకపోతే మనకు కూడా యూరపు దేశీయులకు పట్టినగతి పడుతుంది. వారి మనసులో శరీర విషయమైన ఒక చెడ్డ సంస్కారం చోటు చేసుకుంటుంది. వాస్తవానికి సంస్కారం అమానుషమైంది. లజ్ఞాప్రదమైనది. పిల్లలను నగ్నంగా ఉంచడం ఏమాత్రం అమానుషమైన, లజ్జాస్పదమైన విషయం కాదు.

నాగరిక సమాజానికి బట్టలు, చెప్పులు మొదలైనవి అవసరం అనీ నేనూ ఒప్పుకుంటున్నాను. అందుకనేకదా ఈ వస్తువులు తయారు అవుతున్నాయి. కానీ ఈ వస్తువులు కాని దొరకకపోతే రోజు గడవదనేటంత పరాధీనత, లేదా వస్తువు దొరకకపోతే మనసు కష్టపడడం అంత ఉచితమైనవి కావు. అంటువంటి స్వభావం వల్ల మనకు హాని జరగడం సహజం. భారతదేశపు గాని నీరు ఎంత మంచివంటే ఈ కృత్రిమ వస్తువలకు  మనం దాసులవ్వాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఇంతకు ముందు కూడా మనం వీనికి దాసులం కాలేదు. అవసరాన్నిబట్టి వీటిని ఉపయోగించే వాళ్ళం. వస్త్రాలు మొదలైనవి సాధనాలు కాని లక్ష్యాలు కావు, మన లక్ష్యాలు ఉద్దేశ్యాలు నెరవేరడానికి అవి తోడ్పడతాయి. అంతే ఇంత కంటే వీటికి ప్రాముఖ్యత లేదు. అవసరం వచ్చినప్పుడు చలి మొదలైన బాధల నుంచి కాపాడతాయి. వీటి అవసరం అంటే. అందువల్లనే మనకు శరీరాన్ని ఏ అచ్చాదన లేకుండా ఉంచుకోవడంలో సిగ్గు అనిపించదు. ఇతరులను అనాచ్చాధితంగా చూడడంలో కూడా మనకేమి అప్రసన్నత ఉండేదికాదు. భగవంతుని దయవల్ల ఈ విషయంలో యూరపు వారి కంటే ఎక్కువ సౌకర్యం మనకు ఉంది. మన అవసరం మేరకు మన సిగ్గును కాపాడుకొన్నాం. అనావశ్యకమైన, అధికమైన లజ్జా భారం నుండి మనల్ని కాపాడుకోగలిగాం. ఎక్కువగా సిగ్గు పడటం, కావలసిన సిగ్గును కూడా దూరం చేస్తుందనే మాట మరచిపోకూడదు. అత్యధిక లజ్జాభావన వాస్తవానికి చాలా సిగ్గుమాలిన పని!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *