సెల్వియా ఆస్టన్ వార్నర్ – సజీవ బోధన

ఉపాధ్యాయ లోకం తరగతి గది నిర్వహణ తల్లితండ్రుల లోకం పిల్లల మనస్తత్వ శాస్త్రము బ్లాగ్ రిసోర్స్ సెంటర్

సెల్వియా ఆస్టన్ వార్నర్ – సజీవ బోధన

అమ్మ తర్వాత అంత అందమైన పేరేది?  ………….. టీచర్!

ఆమె న్యూజిలాండ్‌లో పాతికేళ్ళు మెయిరీలకు చదువు చెప్పింది. మెయిరీలంటే నీగ్రోల్లాంటి వారు. యూరోపియన్ల కంటే వెయ్యేళ్ళు ముందు నుంచీ భూమి తల్లిని నమ్ముకొని బతుకుతున్నా తెల్లవాళ్ళు వచ్చి వాళ్ళ సర్వస్వం దోచుకొన్నాక జన్మభూమిలోనే జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్ళు. 81శాతం తెల్లవాళ్ళ మధ్య బిక్కు బిక్కుమంటూ చిక్కుకుపోయిన వాళ్ళు.

సెల్వియా వీళ్ళ హృదయాల్ని తట్టి లేపుతుంది. వాళ్ళ కళ్ళలో కాంతిధారలు కురిపిస్తుంది. వాళ్ళ సంభాషణల్లోంచి సప్తస్వరాలు ఒలికిస్తుంది. ఇందుకోసం ఆమె ఒకానోక బోధనా పద్ధతిని ఎన్నుకొంది. దానికామె ముద్దుగా ”సజీవబోధన” అని పేరు పెట్టుకొంది. ఈ బోధనలో ఆమె ఒక రసమయలోకాన్ని తనకు తాను ఆవిష్కరించుకొంటుంది. తన్మయత్వంతో తేలియాడుతుంది.

సృజనాత్మకత

ప్రతి బిడ్డలో ఒక సృజనాత్మకత ఉంటుందని సెల్వియా నమ్మకం. ఇది నాగరీకుల కంటే ప్రకృతి ఒడిలోని పిల్లల్లో, సుఖజీవుల కంటే కష్టజీవుల్లో మరింత ఉంటుందని ఆమె విశ్వాసం. ఈ సృజనాత్మకతను మనం వెల్లువెత్తిస్తే ఆ బిడ్డలు ప్రపంచాన్ని పదిలంగా నిలబెడతారు. లేకుంటే విధ్వంసం. ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అప్పుడు సర్వనాశనం జరుగుతుంది.

అందుకే ఆమె వాచకాల్ని వ్యతిరేకిస్తుంది. వర్క్‌బుక్‌ని ద్వేషిస్తుంది. అందమైన గౌరవప్రదమైన పదాల్ని ఏవగించుకొంటుంది. కృత్రిమతా, యాంత్రికతా పెనువేసుకొన్న దిక్కు మాలిన బోధనా సామాగ్రినంతటినీ బంగాళాఖాతంలో పారెయ్యమంటుంది. హృదయమున్న టీచరే విద్యకు సర్వస్వమంటుంది.

కీలక పదాలు

మనం అ ఆ లతో మొదలెట్టి అక్షరాలు పలక మీద దిద్దిస్తాం. కాదంటే ముందే మనం తయారు చేసుకొన్న పదాలు నేర్పుతాం. కాదంటే గేయాలు రాసి అందులోంచి అక్షరాల్నో, పదాల్నో వెతుక్కొమ్మంటాం. సెల్వియా దృష్టిలో ఇదంతా చెత్త పద్దతి.

ఆమె కూడా కొన్ని పదాల్ని వెతుక్కొంటుంది. వాటి నుంచే నేర్పడం మొదలు పెడుతుంది. ఆ పదాలు ఆమెవికావు. బిడ్డల ఆలోచనల్లోంచి వచ్చినవి. అనుభవంలోంచి వచ్చినవి. ఆ పదాలు మనకు చెత్తపదాలుగా అన్పించవచ్చు. హేయమైనవిగా తోచవచ్చు. అవి పిల్లలకు మాత్రం లోతైన అర్థం కలవి. జీవితంలో భాగమైనవి.

ఈ పదాల్ని వీటి వెనకగల అనుభవాల్ని ఆమె పిల్లల చేత చెప్పిస్తుంది. అప్పుడు వాళ్ళ జీవితంలోని నవరసాలు కట్టలు తెంచుకొంటాయి. సంభాషణాత్మకంగా ఉంటాయని, వాటిలో సెల్వియా రసతత్వాన్ని చూస్తుంది. లయను అవలోకిస్తుంది. సజీవమైన ఆ భాషలో బిడ్డ అంతరంగాన్ని అల్లుకొన్న ఆవేశాన్ని ఆమె వెలికి తీస్తుంది. అక్కడ సెల్వియా, ఆ బిడ్డా ఇద్దరూ తన్మయులైపోతారు. భాషలోని ఈ సజీవత్వమే భాషా హృదయం. దీనితో జరిపే వ్యాపకమే భాష నేర్చుకోవడం. నేర్చుకొంటున్నా మన్న స్పృహ లేకుండా ఈ నేర్చుకోవడం ఉంటుంది.

దీనికి చాలా ఓపిక కావాలి. మనకు చాలా భేషజాలుంటాయి. భాష శుద్ధత పట్ల మన నమ్మకాలు మనవి. వ్యాకరణం పట్ల మన భయం మనది. కట్టలు తెంచుకొన్న సంభాషణల్లో అనుభవం నుంచి అంతరంగం పొంది పారే భాషా ప్రవాహంలో ఈ గొడవలకు తావుండదు. అన్నీ కొట్టుకుపోతాయి. మనం చూస్తుండాలి. అందులోని అంతరంగాన్ని మాత్రమే చూడగల్లితేనే అందం, భాషాతత్వం మనకు అవగతమవుతాయి.

విచిత్రం ఏమంటే మనం చాలా ఇష్టమనుకొన్న పదాలు ఈ దశలో చాలా సులభంగా మారిపోతాయి. మనం చాల వెనుకబడ్డ వాళ్ళనుకొన్న పిల్లలు కవికుమారలైపోతారు. మన ఊహక్కూడా అందని పదాలు వాళ్ళకి మహా ప్రీతిపాత్రమై కూచుంటాయి. ఎందుకోగాని పిల్లలకి దయ్యం అనే పదం చాలా ఇష్టమంటుంది. సెల్వియా. నిజానికి పైకి పదాలుగా అవి కన్పించినా పిల్లలకు మాత్రం వాళ్ళ అనుభవానికి శీర్షికలేనని సెల్వియా నమ్ముతుంది.

స్వాభావిక రచన

ఈ అనుభవాల్ని పదాల్నించి వాక్యాలకు మళ్ళిస్తే… అప్పుడది రచన అవుతుంది. ఐదేళ్ళ బిడ్డలు కూడా రాయడం మొదలు పెడతారు. ఒక్కొక్కరు ఒక్కో శైలిని రూపొందించుకొంటారు. కీలకపదాలతోనే ఈ రచన ప్రారంభమవుతుంది. క్రమంగా అది విస్తరిస్తుంది.

మన దృష్టిలో అవి అర్థంపర్థంలేని, తీరు తెన్నూలేని వాక్యాలు కావచ్చు. కానీ పిల్లల భావోద్వేగాకవి అక్షర రూపాలు. అది వాళ్ళు మాట్లాడుకొన్నట్టే ఉంటుంది. లోలోపల అనుకొంటున్నట్టే ఉంటుంది. ఎదురెదురుగా కూచుని చెపుతున్నట్టే ఉంటుందగి. కర్త, కర్మ, క్రియలు ఒక పద్దతిలో ఉండవు వాటికి అనాగరికంగా మనక్కన్పిస్తాయి. అయ్యో భాషకింత అన్యాయమా అన్పిస్తుంది. ఇన్ని తప్పులైతే వీడు గట్టెక్కినట్టే అని భయం వేస్తుంది. వీటన్నిటినీ మనం వదిలించుకొని చూస్తే ప్రాథమిక కవిత్వం ఆ వాక్యాల్లో కావల్సినంత కన్పిస్తుంది. వాటిని సవ్యాభావ్యంగా సహృదయాలతో చూడగల్గితే కావల్సినంత రసానందమూ లభిస్తుంది. అక్కడ టీచరు పిల్లవాడి ముందు పిల్లవాడైపోతాడు. ఇక అప్పడు జరిగేది రెండు హృదయాల మధ్య కలబోతలే. దీన్ని సెల్వియా సజీవన బోధన అంటుంది.

పిల్లల స్వంత పుస్తకాలు

ఈ క్రమంలో పిల్లలు రచయితలవుతారు. స్వంత పుస్తకాలు రూపొందిస్తారు. అవన్నీ ఎక్కువ భాగం తమను గురించి తాము రాసుకొన్నవి. ప్రాథమిక దశలో పుస్తకాలు ఒక వాక్యంతోనే ఉండొచ్చు. తర్వాత కథల పుస్తకాలు తయారువుతాయి. వాటిలో వారి కన్నీళ్ళు, కరుణ, కొట్లాటలు, ప్రేమా, పాటలూ అన్నీ ఉంటాయి.

సెల్వియా మొయిరీల జీవితాన్ని ప్రేమిస్తుంది. యూరోపియన్లు తెచ్చి రుద్దిన సంస్కృతిని వ్యతిరేకిస్తుంది. మొయిరీల సంస్కృతి అంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ. అందువల్ల ఈ పుస్తకాల్లో వాళ్ళ సంస్కృతిని ఆమె దర్శిస్తుంది.

ఈ పుస్తకాలు రంగురంగుల ఖరీదైన పుస్తకాలలో పోలిస్తే ఎంతో అద్భుతంగా ఉంటాయి. పిల్లలు వీటికి స్వంతంగా బొమ్మలు వేస్తారు. వాళ్ళు ప్రపంచాన్ని వాళ్ళ స్వంత రంగుల్లో ప్రదర్శిస్తారు. అందువల్ల వాళ్ళ రంగులు వేరుగా ఉంటాయి. ఇలా ప్రతి తరగతికీ, గ్రూపుకి పుస్తకాలు తయారవుతాయి. ఆరేళ్ళలో ఇవి వందలైపొయ్యాయి. అధికార్లు, విద్యాభిమానులు వీటిని చూసి విస్తుపొయ్యారు. కొన్నింటిని తస్కరించడానిక్కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే రాతలోనూ, బొమ్మల్లోనూ ఒక్కో బిడ్డది ఒక్కో శైలి. వాళ్ళు చెట్లనన్నిటినీ పచ్చగానే చూస్తారు. ఆకాశం వారికి నీలంగానే ఉంటుంది. ఇంటి కప్పులు నల్లగానే వారికి కన్పిస్తాయి. మనకు మల్లే రంగురంగుల్లో ఉండవు. ఇదంత వాళ్ళ పరిసరాల్నుంచి, సంస్కృతి నుంచి వచ్చింది. మనసు పెట్టి చూచేవారికి ఒక సజీవ ప్రపంచం వాటిలో కన్పిస్తుంది. అందుకనే ఆ పుస్తకాలకంతటి విలువ.

ఇది సెల్వియా దృష్టిలో సజీవ బోధన అంటే.

ప్రకృతి గణితం

ఈ విశ్వం ఇలా ఉండటానికి మూలం ఈ విశ్వ రహస్యం అంతా గణితమేనని ప్లేటో, ఫైథాగరస్‌లు శతాబ్ధాల క్రితం చెప్పారని మనకు తెలుసు. అయితే స్కూల్లో మన గణితానికి ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. దీన్ని సెల్వియా వ్యతిరేకిస్తుంది.

ప్రకృతిలోని ఒక మొక్కనే తీసుకోండి. అందులోని ఆకులు ఒక సైజులో ఉంటాయి. వాటి మధ్య దూరం ఒకే రకంగా ఉంటుంది. రెండు రెమ్మల మధ్య దూరం కొమ్మ పెరిగే కొద్దీ మారుతుంది. ఆకుల పెరుగదల ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఇందులో ఆరోహణ క్రమం చూడొచ్చు. కోణాలు, రూపాలు చూడొచ్చు. ఒక పువ్వు నుంచి వీటని ఎన్నైనా చూపవచ్చు.

ఐదు అంకెల్ని నేర్పడానికి చేతివేళ్ళనే తీసుకోవచ్చు. చేతి వేళ్ళని కాగితం మీద గియించవచ్చు. ఒక పువ్వు దాని రెక్కలు గీసి చూడవచ్చు. ఈ ప్రకృతిని పిల్లల్ని తదేకంగా చూడమన్నప్పుడు అందులోని రూపాల్ని వాళ్ళు నిశింతంగా చూస్తారు. వాటిని బొమ్మలుగా వేసేప్పుడు వాటి ఆకారాలే గాదు సైజులు, దూరాలు, కోణాలు అన్ని గమనించాల్సి ఉంటుంది. ఎన్ని ఆకులో, రెమ్మలో, తీగలో గుర్తించాల్సి ఉంటుంది. ఇంతకంటే సంఖ్యామానం, దూరమానం, కొలమానం ఏముంటాయి.

అయితే సెల్వియా ఇక్కడితో ఆగదు. ఆమె ప్రకృతిలో గణితాన్ని చూస్తూనే ప్రకృతిని ప్రేమిస్తుంది. సౌందర్యారాధనలో ముగ్ధురాలవుతుంది.ఒక తోటలోని మొక్కల మధ్య పిల్లల్ని తిప్పుతూ, పూలని చూపుతూ, సువాసనల్లిన పీల్చుతూ ఆమె గణిత బోధనలో ప్రకృతి అనుభూతిని కూడా పొందుతుంది. పిల్లలు కూడా అలాంటి స్పందనలకు లోనయ్యేలా చేస్తుంది.

నిత్య జీవితంలో జరిగే ప్రతిదాన్నుంచీ ఆమె లెక్కలు నేర్పిస్తుంది. తోటలో తిరగే పిల్లల్ని లెక్కిస్తుంది. తప్పిపోయనవా్ళ్లతో తీసి వేతలు చూపిస్తుంది. ఏడేళ్ళ పిల్లలు అన్ని లెక్కలు చేస్తారనీ 100దాకా అంకేలు రాయగలరని ఆమె చెపుతుంది. ఇలా నేర్పేటప్పుడు మనం సాధారణంగా వాడే చార్టులు ఆమె దృష్టిలో ఎండిపోయిన రొట్టెల్లాంటివి. గతిలేక పనికి రాకున్నా పదేపదే వాడి తృప్తిపడతాం కాబట్టి వీటికంతకంటే మంచి పోలిక ఆమెకు కన్పించదు మరి.

దృఢమైన అభిప్రాయాలు

ఇలా చేయ్యాలంటే ఒక్క చదువు పట్లే కాదు ప్రపంచం పట్ల, పిల్లల పట్ల, సంస్కృతి పట్ల, మన రోజువారి బోధనారీతల పట్ల ఒక స్పష్టత ఉండాలి. రాజీలేని స్పష్టత ఉండాలి. సెల్వియా దీన్ని చాలా కఠినంగా స్వంతం చేసుకొంది. అందువల్ల ఆమె తన భావాల్ని చెప్పేప్పుడు తన పని తాను చేసేప్పుడు ఎక్కడా తడబడదు. ఎక్కడా రాజీ పడదు.

వర్క్ ఒక క్రమబద్ధత కోసం, ప్లానింగు కోసం అవసరమని ఉపాధ్యాయులను కొంటారు. కానీ జీవితం వర్క్ బుక్‌లా క్రమబద్ధం కాదే. అది వైవిధ్యభరితమే. మన భావాల్ని అమలు చేయ్యడానికి ఒక మాధ్యమం అవసరమా.. రవీంద్రుడు నేరుగా గీతాల్ని హృదయం నుంచే వెళ్ళగక్కాడు జీసస్ తన ్పరబోధాలకు ముందు నోట్సు రాసుకొన్న దాఖలాలు లేవు. సృజనాత్మకత కరువైనపుడు వర్క్‌బుక్స్ లాంటివి వస్తాయి. సృజనశీలత వున్న చోటనే జీవితం ఉంటుంది. విద్యార్థల జీవితం అందులోని భావోద్రేకాలు వర్క్‌బుక్కుల జోస్యాలపై ఆధారపడి వుండవు. నిజమైన మాస్టారు కళాకారుడు ప్రొఫెసర్‌గాదు అని ఖరాఖండిగా చెపుతుందామె.

పిల్లలకి స్వంత వస్తువులుంచరు. వాటిని గురించి ఆలోచంచనివ్వరు. వాటిలో తన్మయత్వం పొందనివ్వరు. పసితనం నుంచి తళతళలాడే ఆట బొమ్మలిస్తారు. కిండర్ గార్టెన్ స్కూళ్ళను దగదగలాడే బొమ్మలతో, వస్తువులతో నింపేస్తారు. ఇక వాళ్ళ మనో ప్రపంచం ఖాళీకుండగాక మరేమవుతుంది. ఇదీ ఆట బొమ్మల మీద, మన స్కూళ్ళలోని ఖరీదైన సామాగ్రి మీద సెల్వియా వ్యాఖ్యానం.

ఇంత కఠినంగా వ్యాఖ్యానించడానికి సెల్వియా చూపే కారణం ఒక్కటే. మన ఆధునిక విద్యావిదానం అంతా మూసపోసిన బొమ్మలాంటిది. పైకి ఈ విద్యావిధానం పిల్లలు తమంత తాము వ్యక్తిత్వం సంతరించుకొనేలా ప్రోత్సహించాలంటుంది. సృజనాత్మకమైన సంపూర్ణ మానవులు కావాలని చెపుతుంది. దీనికోసం కొత్త పుస్తకాలు, సామాగ్రి, రేడియో, మీడియా చాలా చాలా తెలుస్తుంది. అయితే ప్రతి వెయ్యిమందిలో తొమ్మిదివందలా తొంభై తొమ్మిది మంది మూసబోసినట్లు తయారవుతున్నారు. ఇదీ ఆమె ఆవేదన.

ఆమె దృష్టిలో పసిపిల్లల తరగతిలో జరిగే ప్రతి పనీ సృజనాత్మకమో, వినాశకరమో అయి ఉంటుంది. మనం గీసే బొమ్మ, రాసే పదం, చెప్పే మాటా, చేసే నృత్యం ప్రతి ఒక్కటీ ఈ రెండింటిలో ఏదో ఒక మార్గంలో ఉంటుంది. అసలు జీవితానికే ఒక అంతర్గత పురోగమన శక్తి ఉంది. అది నిత్యం పెరుగుతుంటుంది. వ్యక్తం కావాలని ఆరాటపడుతుంది. నిత్యం సజీవత్వం కోసం అది తపనపడుతుంది. మరి మనం పిల్లల్లో పెంచాల్సింది ఈ అంతర్గత పురోగమనశక్తిని. దాన్ని పెంచనప్పుడు వినాశం మిగులుతుంది. విధ్వంసం మిగులుతుంది. సృజనాత్మకంగాని జీవిత పర్యవసానమే విధ్వంసం.

ఇందుకోసమే సెల్వియా తన పద్ధతిని తాను ఎన్నుకొంది. నాకు నిజమైన జీవితమంటే ఇష్టం. పాఠశాలల్లో కూడా అదే నేను కోరుకొంటాను. సజీవమైనదాన్ని మాత్రమే నేను ప్రేమిస్తాను. అంటూ మొయిరీ పిల్లల్లో పాతికేళ్ళు కలిసిపోయి టీచర్ అనే మాటకి ఒక అర్థాన్ని వెతుక్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *