‘మీసాల అమ్మ’గిజూభాయి

ఉపాధ్యాయ లోకం తల్లితండ్రుల లోకం బ్లాగ్ రిసోర్స్ సెంటర్

‘మీసాల అమ్మ’గిజూభాయి

“విత్తనంలో వృక్షం వున్నట్టే పసివాడిలోనూ సంపుర్ణమైన మానవుడుంటాడు”

“పిల్లల రంగుల రహస్యమయ జీవితాన్ని తల్లిదండ్రులు కలలోనైనా చూడలేరు. విచారమయమైన విషయం ఏమంటే పిల్లల్ని కూడా దానికి దూరం చేస్తున్నారు”

“ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థితోనూ అతని స్థాయిలో వ్యవహరించాలి. దీనికేంతో ఓర్పూ, నేర్పూ కావాలి. ఈ ప్రక్రియ ఉపాధ్యాయుడికీ విద్యార్థికీ మధ్య ఓ అనురాగ బంధాన్ని వేస్తుంది. అప్పుడు తరగతి నూతనోత్సహంతో ఉత్తేజంతో నిండిపోతుంది”

అనుచిత సహాయం (తల్లిదండ్రుల కోసం)

ఏమిటి సంగతి? తలుపులు రావడం లేదా?

ఉండు నేను వచ్చి తీస్తాను.

నాడా ముడి రావడం లేదా?

రా నేను తీసి కడతాను.

టోపీ అందడం లేదా?

అయితే వుండు నేను వచ్చి తీసిస్తాను.

మేకు దిగడం లేదా?

వదిలెయ్. నేను సాయంత్రం కొడతాను.

పైజామా తొడుక్కోని లేకపోతున్నావా?

నేను తొడుగుతాలే.

ఉచిత సహాయం

ఏమిటి సంగతి? తలుపులు రావడం లేదా?

చూడు ఇలా లాగు తలుపు తెరుచుకొంటుంది.

నాడా ముడి రావడం లేదా?

ఇదిగో ఇలా కట్టుకో, ఇలా ముడి వేసుకో.

టోపీ అందడం లేదా?

అదిగో ఆ కర్రతోతీసుకో.

మేకు దిగడం లేదా?

సుత్తి ఇలా పట్టుకో. మేకు మీద బలంగా కొట్టు.

పైజామా తొడుక్కోని లేకపోతున్నావా?

చూడు ఇళా స్టూలు మీద కూర్చో. ఇలా కాళ్ళు దూర్పు.

(తల్లిదండ్రుల తననొప్పి నుంచి)

నా పాఠాశాలలో ఇది కుదరదు (టీచర్ల కోసం)

నా పాఠశాలలో బోధనా విధానాలపై పెద్ద పెద్ద పుస్తకాలు లేకున్నా ఫరవాలేదు. కాని ఉన్న పుస్తకాల్ని అడటిగి తీసుకొని చదవక పోవడం మాత్రం కుదరదు.

పాలరాయి లాంటి గచ్చు మా తరగతికి లేకున్నా ఫరవాలేదు. గచ్చులేచి పోయిగుంటలు పడి కనీసం మట్టి,సున్నమైనా అద్దకుండా ఉంటే మాత్రం కుదరదు.

బడి గోడలకి అందమై రంగులు వెయ్యకపోయినా ఫరవాలేదు. ఓక సాలెగూడు గాని, బూజుగాని వుంటే కుదరదు.

బాలాసాహిత్యం గల పెద్ద గ్రంథాలయం లేకున్నా ఫరవాలేదు. చేతిలో రాసిన పుస్తకమయితేనేం పిల్లలు ఉత్సాహంగా ఆసక్తిగా చదివేది లేకపోతే మాత్రం కుదరదు.

ప్రతి నిమిషం చదివిస్తూనో, వారి జ్ఞానాన్ని పెంచాలనో నేను పరిగెత్తకపోయినా ఫరవాలేదు. పిల్లల పనికి ఆటంకాలు గల్లించి,భయపెట్టి, తిట్టి కూర్చో పెట్టడం మాత్రం కుదరదు.

నా పాఠశాళలో పిల్లలు నా మెడపట్టుకొని ఊపకపోయినా, నా చుట్టూ తిరగపోయినా ఫరవాలేదు. నన్ను చూసి భయరపడ్డం, దూరంగా తిరగడం మాత్రం కుదరదు.

నా బడిలో పిల్లలు తక్కువ చదివినా ఫరవాలేదు. నెమ్మదిగా నేర్చుకొన్నా ఫరవాలేదు. గట్టిగా అరచి అలిసిపోవడం మాత్రం కుదరదు.

సమయానికి పని పూర్తి చేయకపోయినా ఫరవాలేదు. నేను కొడతానని,తిడతానని నా కోసమే అన్నట్టు హడావుడిగా ఆ పని చేయ్యడం మాత్రం కుదరదు.

….. మాస్టారూ నుంచి

ఇలా పిల్లల్నీ, తల్లిదండ్రుల్నీ, పంతుళ్ళనీ వారి మధ్య ఓ అద్భుత అనురాగమయ ప్రపంచాన్నీ ఊపించుకొన్న స్వాప్నిక చక్రవర్తి గిజూభాయి. ఆయన స్వప్నలోకంలో పిల్లలందరూ రెక్కలు విప్పిన పిట్టలే! రేకులు విచ్చిన పువ్వులే! మొగ్గలు తొడిగిన తీగలే! తంత్రులు మీటిన వీణలే! ఆ పిల్లల మరో ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో జీవితంలోని అనువణువూ వెచ్చించి, అందులోని ఆనందంతో అణువణువూ పులకించిన సౌందర్య పిపాసి గిజూభాయి.

గిజూభాయిది గుజరాత్ రాష్ర్టం. ఆయన వృతిరీత్యా హైకోర్టు న్యాయవాది. ముఫ్పై ఐదేళ్ళ వయస్సులోనే శేష జీవితం పిల్లలకే అకింతం అనుకొన్నాడాయన. 1922లో భావనగర్‌లో ఆయన స్వప్నలోకం బాలమందిరంగా వెలిసింది! అప్పటి నుంచీ ఆయన పసి బిడ్డలా మారి పోయాడు. ఆయన అచ్చం అమ్మ లాంటి మాస్టారే. ఒక్క మీసాలే ఎక్కువ. అందుకే మీసాల అమ్మగా ఆయన్ను అందరూ పిలిచేవారు.

పిల్లల అభిరుచులు, అలవాట్లు, ఆటలు,చేష్టలు, నైపుణ్యాలు అన్నిటి కంటే మించినవాళ్ళ హృదయాన్ని మన దేశంలో గిజూభాయిలాగా విశ్లేషించనివారు లేరు. తన బాలమందిరంలో తాను కలలుగన్న వన్నీ ఆయన ప్రయోగించి చూచాడు. తల్లిదండ్రులకీ, పంతుళ్ళకీ తన అనుభవాల్ని పంచి పెట్టడంలోనే తన జన్మ సార్థకతను వెతుక్కొన్నాడు. అందుకోసం ఆయన ఐదు పుస్తకాలు రాశాడు. మరో 223 పుస్తకాల రచనకు సాయం అందించాడు. 600మంది టీచర్లకు శిక్షణ ఇచ్చాడు.

గిజూభాయి ఏదో నేల విడిచి సాము చేసిన అతిలో భావుకుడు గాదు. ఆయనకు ఖచ్చితమైన విద్యాతత్వం వుంది. దాన్ని ఆచరణలో నిరూపించిన అనుభవం వుంది. ఇదో ఉద్యమంగా, సంస్కృతిగా మన జీవన స్రవంతిలో కలిసిపోవాలన్న తపన వుంది. ఇందుకోసం తనకంటూ ఓ కార్యాచరణ వుంది. ఆయన అధ్యాపన మందిర్ స్థాపించాడు. తల్లిదండ్రులకూ, టీచర్లకూ పాఠాలు చెప్పాడు. గుణపాఠాలు చూపించాడు. మహాత్మాగాంధీ నుంచి మారుమూల టీచరుదాకా ఆయన్ను ప్రాధమిక విధ్యలో సాకార ఆదర్శమన్నారు.

తల్లిదండ్రుల తలనొప్పి, పగటి కల, మాస్టారూ, మీ ఒడిలో లాంటి ఆయన పుస్తకాల్లో భావితరం కోసం తన అనుభవాలూ, ఆకాంక్షలూ గిజూభాయి రాసిపోసాడు. ఆయన మరణించి ఏళ్ళు కావస్తోంది. అయినా ఇంటా, స్కూల్లో ఆయన ఆశించిన మేరకు ఏమైనా మార్పు వచ్చిందా… అందుకు మనం ఏమైనా పూనుకోగలమా… కనీసం ఆవైపు మన ప్రయాణం సాగుతోందా… ఆయన పుస్తకంలోని ఏ పుటను తిరకేసినా, ఏ వాక్యం చదివినా ఈ ప్రశ్నలే మనల్ని వెంటాడుతాయి.

ఒక్క భాషేకాదు – పిల్లలు మన దగ్గరికి వచ్చేప్పటికి ఎన్నో నేర్చుకొని వుంటారు. ఇంకా ఎన్నో విషయాలు బడికి రాకున్నా నేర్చుకొంటారు. ఇవన్నీ తమకు తాముగా, మరొకరి సాయం లేకుండా జీవితంలో ఎదురవుతున్న సహజ సన్నివేశాలలో పాల్గొనడం ద్వారా నేర్చుకొంటారు. తమకు అవసరమైనంత మేరకే నేర్చుకొంటారు. మన తరగతిలోను ఈ సహజ సన్నివేశాలూ, అవసరానికి తగ్గ విషయ బోధనా ఉంటే పిల్లలు తప్పకుండా నేర్చుకొంటారు. వీటిని దాదాపు అందరూ సమానంగా నేర్చుకొంటారు.

పిల్లలు ఇలానే నేర్చుకొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *