జగదీష్ చంద్రబోస్ (1858-1937)

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

జగదీష్ చంద్రబోస్ (1858-1937)

వైర్‌లెస్ టెలిగ్రాఫ్‌ను కనుగొన్నది ఎవరు? అంటే మన సమాధానం మార్కోని అని వస్తుంది.అయితే మార్కోని కంటే ముందు వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ గురించి విస్తృత పరిశోధనలు చేసి ప్రపంచానికి ప్రయోగ పూర్వకంగా నిరూపించినది భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. అయితే ఆయన వైర్‌లెస్‌ ప్రయోగాలపై పేటెంట్‌ రిజిష్టరు  చేయక పోవటం వల్ల ఆయనకు ఆ కీర్తి దక్కలేదు. వైజ్ఞానికి పరిశోదనలను సొమ్ము చేసుకోవటం ఇష్టం లేక అందుకు ఆయన నిరాకరించారు. మొక్కల్లో ప్రాణముందని, వాటికి కూడా సంతోషం. దుఖం, బాధ తెలుసునని ప్రపంచానికి తెలియజేశారు.

మొక్కలకు వేసవికాలంలో నాడీ స్పందన ఎక్కువగాను, శీతాకాలంలో తక్కువగా వుంటుందని తెలియజేశారు. మెదడు లేని మొక్కలలో చిన్న చిన్న కణజాలాల ఆధారంగానే స్పందనలు చేస్తాయని తెలియజేశారు. అయితే మొక్కలలో ప్రతిస్పందనలు, జంతువులలో కంటే కొంత ఆలస్యంగా గుర్తించగలవని మొక్కలు రాత్రి పన్నెండు గంటలకు నిద్రించి ఉదయం ఎనిమిది గంటలకు మేల్కొంటాయని ఆయన తెలియజేశారు.

జగదీష్ చంద్రబోస్ (జె.సి.బోస్) 1858 నవంబర్ 30వ తేదీన మైమెన్‌సింగ్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో జన్మించారు. ఆయన చిన్నతనం ఫరీద్పూర్‌లో గడిచింది. అక్కడి రైతు పిల్లలతో  బెస్తవారి పిల్లలతో కలిసి తిరగటం వల్ల ప్రకృతి మీద ఆయన అపార అబిమానం పెంచుకున్నారు. తొమ్మిదవ ఏట కలకత్తా చేరుకున్నారు. అక్కడ మొదటి హేర్ స్కూల్లోను ఆ తర్వాత సెయింట్‌ గ్జావియర్ స్కూల్లో చదివారు. ఆ స్కూల్లో ఫారద్ లాపోంట్ భౌతిక శాస్త్రాన్ని ప్రయోగ పూర్వకంగా బోధించటం వల్ల దాని మీద ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అయితే వృక్షశాస్త్రం మీద అంతే అబిమానం పెంచుకున్నారు. వివిధ రకాల మొక్కలను సేకరించి వాటి వేరు వ్యవస్థను పరిశీలించేవారు. వివిధ రకాల పుష్పించే మొక్కలను పెంచుతూ వాటి పెరుగుదలను నిశితంగా పరిశీలించేవారు.

బోస్ తండ్రి డిప్యూటీ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. బోస్ భారతీయ సంస్కృతి సంప్రదాయాల మధ్య పెరిగారు. తల్లి ద్వారా రామాయణ, మహాభారతాలను తెలుసుకొన్నారు. సెయింట్ జేవియర్ స్కూల్లో కొంత మంది ఆంగ్లో ఇండియన్, యూరోపియన్ పిల్లలు బోస్‌ను చులకనగా చూసేవారు. క్లాసులోని బాక్సింగ్ ఛాంపియన్ అయిన ఒక కుర్రవాడు బోసును సవాలు చేశాడు. అందుకు ప్రతిగా ఆ బాక్సర్ కుర్రవాడిని చితకబాది బుద్ధి చెప్పాడు. అప్పటి నుండి మరెవరూ ఆయనను వేధించలేదు.

188౦లో జగదీష్ చంద్రబోస్ మెడిసిన్ చదవటానికి యూనివర్సిటీ ఆఫ్ లండన్లో చేరేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లారు. అక్కడ తరచూ మలేరియాకు గురి కావడంతో స్కాలర్ షిప్ మీద కేంబ్రిడ్జిలో నేచురల్ సైన్స్‌లో క్రీస్ట్స్‌ కాలేజీలో చదవవలసి వచ్చింది. అక్కడ సర్‌మైకెల్‌ ఫాస్టర్‌, ప్రాన్సిస్‌ డార్విన్ వంటి టీచర్ల ప్రభావం ఆయన మీద ఎంతగానో పడింది. 1884లో కేంబ్రిడ్జి నుంచి బి.ఏ  తర్వాత సంవత్సరములో లండన్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ తీసుకున్నారు.

1885లో భారత్‌కు తిరిగి వచ్చినప్పడు కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అఫిషియేటింగ్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం లభించింది. అయితే అక్కడి యాజమాన్యం బ్రిటిష్‌ టీచర్లకిచ్చే జీతంలో సగమే ఇస్తామని షరతు పెట్టారు. అందుకు నిరసనగా ఆయన మూడు సంవత్సరాల పాటు జీతం తీసుకోకుండానే పనిచేశారు. ఆ సమయంలో ఆయన విద్యార్థులకు పాఠాలను ప్రయోగ పూర్వకంగా బోధించేవారు.అందుకే విద్యార్థులకు ఆయన అభిమాన ఉపాధ్యాయుడుగా పేరుపొందారు. పుస్తకాలు సహాయం లేకుండా ప్రతీ విషయాన్ని పరిశీలించటం, ప్రశ్నించటం ప్రయోగాలు చేసి పరిశోధించటం వంటివి అలవర్చుకోనేటట్లు విద్యార్థులను ప్రోత్సహించేవారు. మూడేళ్ళు ఆ కాలేజీలో పనిచేసిన పిదప అప్పటి ప్రిన్సిపల్ ట్వాని, డైరెక్టర్ క్ట్రాఫ్ట్లు ఆయన ప్రతిభకు మెచ్చి ఆయన చేరినప్పటి నుండి పూర్తి జీతం ఇవ్వాలని సిఫారసు చేశారు. ఈ ఉదతం ద్వారా బ్రిటీష్‌ వారితో వ్యవహరించేటప్పుడు ఆత్మస్థైర్యంతో దేనినైనా సాధించవచ్చునని తెలుసుకొన్నారు.

ఆ రోజులలో సరైన ప్రయోగశాలలు ఉండేవి కావు. అందుకే ఆయన తన బాత్‌రూమ్‌ ప్రక్కగా ఉండే చిన్న గదిని తన ప్రయోగశాలగా మార్చుకొన్నారు. తరగతులు అయిపోయిన తర్వాత ఆయన తన ప్రయోగశాలలోనే ఎక్కువకాలం గడిపేవారు. తనకు కావాల్సిన పరికరాలను తనే తయారు చేసుకొనేవారు. దానికి అయ్యేఖర్చును కూడా ఆయనే భరించేవారు. ఆయన తన ప్రయోగశాలలో రిఫ్రాక్షన్, డిఫ్రాక్షన్, పోలరైజేషన్ వంటి వాటిమీద ప్రయోగాలు చేసేవారు. ఎలక్ర్టో మాగ్నెటిక్ వేవ్స్ ఉత్పత్తి చేసే పరికరాన్ని కనుగొన్నారు. 1894లో ఎలక్ర్టో మాగ్నటిక్ వేవ్స్ ఆధారంగా  వైర్‌లెస్‌ ట్రాన్స్ మిట్‌ను ప్రదర్శించి చూపారు. ఈ తరంగాల ద్వారా కొంత దూరంలో వున్న బెల్‌ మ్రోగించటం, గన్‌ పౌడర్‌ను బార్ ద్వారా మండించి చూపించారు. “ కోహిరర్‌ ” అనే పరికరానికి ఇంగ్లాండులో ఎంతో ప్రాచుర్యం లభించింది. జెజె థామ్సన్, పాయిన్కేర్ వంటి శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని గూర్చి పలు పుస్తకాల్లో ప్రస్తావించారు. “ ఫాదర్ ఆఫ్ వైర్‌లెస్‌ టెలిగ్రఫీ ” అని జే.సి. బోస్‌ను మన శాస్ర్తవేత్తలు అభివర్ణించారు. వైర్‌లెస్‌ ట్రాన్స్‌ మిషన్ మీద పరిశోధనలు జరిపిన ఒక సంవత్సరం తర్వాత మార్కోని ఆ పరిశోధనలపై పేటెంట్‌ రిజిష్టర్ చేశారు. జే.సి బోస్ తన పరిశోధనలపై పేటెంట్ రిజిష్టరు చేయక పోవడం వలననే ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు.

1899-1900  సంవత్సరం మధ్య బోసు తన పరిశోధనలను “ ప్లాంట్ ఫిజియోలజి ” పై దృష్టి మరల్చారు. మొక్కల కదలికలు, జీవన ధర్మాలను “ క్రెస్కోగ్రాఫ్‌ ” అనే పరికరం ద్వారా ఆయన గుర్తించగల్గారు. రెసోసెన్స్ రికార్డుర్ ఆసిలేటింగ్‌ రికార్డర్‌ ద్వార సెకండులో వెయ్యో భాగంలో మొక్కల ఆకులలో, కణజాలాలలో జరిగే అనేక ప్రభావాలను ఆయన గుర్తించగల్గారు.

ఆయన స్వయంగా రూపొందించిన “ కెస్కోగ్రాఫ్ ” పరికరం ద్వారా మొక్కల వివిధ జీవన ధర్మాలను పరిశోధించారు. “ క్రెస్కోగ్రాఫ్ ” సహాయంతో మొక్కల జీవకణాలను పదివేల రెట్లు పెద్దవి చేసి చూడవచ్చు. ఈ పరికరాన్ని గూర్చి ప్రపంచ నలుమూలల నుండి ప్రశంసలు లభించాయి. మొక్కల మీద ఎరువులు, కాంతి కిరణాలు, అల్ర్టావైలెట్ కిరణాలు, విష పదార్థాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రపంచానికి ఆయన వెల్లడించారు. 1901న రాయల్ సొసైటీ ఆఫ్ లండన్లో మొక్కలు బ్రోమైడ్ విష పదార్థం వల్ల ఏ విధంగా చనిపోతాయో ఆయన ప్రయోగ పూర్వకంగా నిరూపించారు.

ఒక మొక్కను తన పరికరానికి అమర్చి దాని వేళ్ళను బ్రోమైడ్ ద్రావణంలో ఉంచారు. పరికరం ద్వారా కాంతి తెర మీద ప్రసారమయ్యేట్లు చేశారు. మొక్క యొక్క స్పందనలను తెరమీద చూపగల్గారు. గడియారంలోని లోలకంలాగా ఆ ప్రతిబింబం కదలటం శాస్త్రవేత్తలు గమనించారు. బ్రోమైడ్‌ ప్రభావం వల్ల మొక్క మరణించింది.

ఈ ప్రయోగం పూర్తవగానే రాయల్‌ సొసైటీ భవనం కరతాళ ధ్వనులతో మ్రోగిపోయింది. అయితే కొంత మందికి ఈ ప్రయోగం నచ్చలేదు. బోస్ చేసిన ప్రయోగాలను రాయల్ సొసైటీ ప్రచురించటానికి వీలు పడదని అడ్డు తగిలారు.

బోస్ అంతటితో ఆగక రెండు సంవత్సరాలు నిరంతరం పరిశోధనలు చేసి జీవ నిర్జీవాలతో ప్రతిస్పందనలు గూర్చి ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. దానిని రాయల్ సొసైటీ ఆమోదించి ప్రచురించి ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేసింది19001 మే 10వ తేదీన రాయల్ సొసైటీలోని సభా భవనంలో బోస్ తన ప్రయోగాన్ని నిరూపించుకొన్నారు. 1920లో ఆయన రాయల్ సోసైటీలో సభ్యులుగా ఎంపిక అయ్యారు.

మొక్కలకు, జంతువులు, మానవుల మాదిరిగా ప్రాణం ఉంటుందని, వేడికి, చలికి, కాంతికి, శబ్ధానికి అవి కూడా స్పందిస్తాయిని ప్రపంచానికి ప్రయోగ పూర్వకంగా మొట్ట మొదటిగా వెల్లడి చేసినవారు జగదీష్‌ చంద్రబోస్‌

తన చిరకాలం వాంఛ అయిన బోస్ ఇన్‌స్టిట్యూట్‌ను 1917వ సంవత్సరం నవంబర్ 30న ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఒక ప్రయోగశాల కాదు. ఒక దేవాలయం అని అభివర్ణించారు.

జగదీష్ చంద్రబోస్‌కు క్రికెట్‌ అంటే ఇష్టం. జె.సి. బోస్ నీట్‌గా డ్రస్ చేసుకొనేవారు. సైన్స్‌కు సంబంధించిన పబ్లిక్ మీటింగ్‌లకు తప్ప మిగతా వారికి దూరంగా ఉండేవారు. గార్డన్లో నడిచేటప్పుడుగాని, కారు నడిపేటప్పుడు గాని ఆయన ఆలోచనా సముద్రంలో మునిగి ఉండేవారు. ఆయన ప్రకృతిని ఎక్కువగా ఆరాధించేవారు. భారతీయులు విదేశీయులను అనుకరించకుండా సొంత ఆలోచనలతో పరిశోధనలను కొనసాగించాలని ఆయన ప్రబోధించారు.

బోస్ ప్రయోగాలన్నీ కలకత్తాలోనే జరిగాయి. అయితే మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద వంటి కొందరు మాత్రమే ఆయన ప్రతిభను గుర్తించగలిగారు. మిగిలిన భారతదేశం ఆయన ప్రతిభను గుర్తించలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ బోస్‌కు మంచి మిత్రులు. అంతేగాక ఆర్థికంగా బోస్‌కు ఆదుకుని ఆయన పరిశోధనలకు అండగా నిలిచారు. పాశ్చాత్య దేశాలన్నీ బోస్ ప్రతిభను గుర్తించిన తర్వాతగాని ఆయన ప్రతిభను మన దేశం గుర్తించలేదు.

1902లో “ ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ ” 1926లో “ ది నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ ” ఆయన వ్రాసిన ఈ రెండు పుస్తకాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి.

అయితే దురదృష్టవశాత్తు విజ్ఞాన శాస్ర్తంలో ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు. బోస్ నవంబర్ 23, 1937లో తన ఎనభైయవ్వ  యేటకు ఒక వారం రోజుల ముందు చనిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *