థామస్ ఆల్వా ఎడిసన్ (1847-1931)
మనం కొద్ది క్షణాలు కరెంట్ పోతే విల విల లాడిపోతాం. ఈనాడు ఊరూ, వాడా, పల్లె, పల్లెలు లైట్ల కాంతితో వెలిగిపోతున్నాయి. ఈనాడు టెలిఫోన్ లేని ఊరు లేదంటే అతియోక్తి కాదు. ఈ ఆవిష్కరలకు మూల పురుషుడు ఎవరో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్ దాదాపు 1000 ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు కలిగి వున్న ఈయన చిన్న వయసులోనే బడి మానేశాడంటే మనకు ఆశ్చర్యం కల్గుతుంది. దాదాపు 1600 ప్రయోగాలు, వివిధ లోహాలతో చేసి ౩,౦౦౦ సిద్ధాంతాలను ఊహించి చివరకు కార్భన్ ఫిలమెంట్‌తో ఎలక్ర్టిక్ బల్బును 1877వ సంవత్సరం ఇరవైఒకటవ తేదీన నలభై గంటల పాటు వెలిగించి చూపించి ప్రపంచానికి క్రొత్త వెలుగును ప్రసాదించారు. ఎంతో ఓర్పుతో పట్టుదలతో తన ఊహాశక్తికి రూపం కల్పించి అనేక అద్భత పరికరాలను సృష్టించిన ప్రతిభాశాలి. ఆధునిక యాంత్రిక నాగరికతకు మార్గదర్శి మూల పురుషుడు థామసం ఆల్వా ఎడిసన్
ఆయన ఎలక్ర్టిక్ బల్బును కనుగొనడానికి ఎన్ని తంటాలు పడ్డారో ఒకసారి చూద్దాం. ఆయన యాభై మంది సహాయకులతో పరిశోధనలు మొదలు పెట్టారు. వివిధ లోహాలు, వివిధ సిద్ధాంతాలతో దాదారు రెండు సంవత్సరాలు కృషి చేసి విసిగి వేసారి పోయారు. అప్పుడు కాకతాళీయంగా ఆయన చేతికి నూలుదారం తగిలింది. వెంటనే ఆ నూలు దారాన్ని కార్బనైజ్ చేయడానికి ప్రయత్నించారు. అందుకు నూలు దారపు ముక్కను నికెల్ మోల్డ్లో పెట్టి దాదాపు ఐదు గంటలపాటు కొలిమిలో ఉంచారు. ఆ మోల్డ్ ను చల్లార్చి నూలు దారం తీసి బల్బులో పెట్టి సీల్ వేయాలి. రెండు రాత్రులు ఒక పగలు కష్టపడి ఒక దారపు వుండనంతా ఉపయోగించి, నూలు దారపు ముక్క విరగకుండా ఎడిసన్ ఆయన సహాయకుడు “ బాచ్‌లర్ ” కలిసి తీయగలిగారు.
ఇక చూడండి ఆయన ఆనందానికి అంతేలేదు. ఆయన ఆనందాన్ని ఆయన మాటల్లో విందాం. దానిని గాజు తయారుచేసే వాని వద్దకు తీసుకు వెళ్ళవలసి వచ్చింది. బాచ్‌లర్ ఆ విలువైన కార్భన్ను ఎంతో జాగ్రత్తగా తీసుకొని బయలు దేరాడు. ఆయన వెనుక నేను ఒక పెద్ద ధనాగారాన్ని కాపాడే వాడిలాగా కాపలా కాస్తూ నడిచాను. ఆ గాజు తయారు చేసే వాడి వద్దకు వచ్చేసరికి ఆ దురదృష్టపు కార్బన్ విరిగింది. మేము మరలా పరిశోధనాలయానికి వెళ్ళి మధ్యాహ్నానికి మళ్ళీ కార్భన్‌ను తయారు చేశాం. కాని దానిమీద స్ర్కూడ్రైవర్ పడి అదీ విరిగింది. మరలా వెనక్కు పోయి రాత్రికల్లా కర్బన్ తయారు చేసి దానిని బల్బులో చొప్పించగల్గాము. బల్బులోని గాలి తీసేసి సీల్ వేసి కరెంట్ ఆన్ చేశాము. ఎంతో కాలఁగా మేము కలలుగన్న దృశ్యం మా కళ్ళబడింది. ఆ బల్బ్ దాదాపు నలభై గంటలు వెలిగింది. కారు చీకటి రాత్రులను పట్టపగలుగామార్చే ఎలక్ర్టిక్ దీపం జన్మించింది.
1889లో పారిస్‌లో ఒక గొప్ప వైజ్ఞానికి వస్తు ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శించిన వస్తువుల్లో తొంభైశాతంపైగా థామస్ ఎడిసన్‌వే కావటం విశేషం. ఇంతటి ప్రతిభావంతమైన వస్తువులను ప్రదర్శించినవారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
ఇక ఆయన జీవిత చరిత్ర గూర్చి కొంచెం తెలుసుకొందాం. ఎడిసన్ 1847వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన అమెరికాలోని ఒహియో రాష్ర్టంలో మిలన్ వద్ద జన్మించారు. తల్లి స్కాట్‌లాండ్ దేశస్తురాలు. తండ్రి డచ్ దేశస్తుడు.
ఎక్కువగా ప్రశ్నలు వేసి వేధిస్తున్నాడని ఉపాధ్యాయుడు దండించడంతో చిన్న వయస్సులోనే బడి మానేశారు. అతనికి చదువంతా అతని తల్లి నేర్పింది. ఆయన పరిశోధనలు కూడా చిన్ననాడే ప్రారంభించారు. పదేళ్ళ వయస్సు నాటికే ఆయన సొంతంగా లేబొరేటరిని ఏర్పరచుకొన్నారు. కోడి గ్రుడ్లను పొట్ట క్రింద పెట్టుకొని పొదిగిన పిల్లలను తయారు చేస్తుంది. నేనేందుకు చేయకూడదని ప్రశ్నించారు. ఏడేండ్ల బాలుడైన ఎడిసన్ ఆర్థికంగా నిలబడటానికి ఆయన రైళ్ళలో న్యూస్ పేపర్, స్వీట్లు అమ్మేవారు. చిన్న వయసులోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేశారు.
మనం ప్రతిరోజు ఉపయోగించే అనేక పరికరాలు ఎడిసన్ కృషి ఫలితాలే. ఎలక్ట్రికల్ లైట్ వెలిగించినప్పడు గ్రామ్ ఫోన్ విన్నప్పుడు, టెలిఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పడు మనకు ఎడిసన్ గుర్తుకు వస్తుంటారు. 1847-1889 మధ్యకాలంలో టైప్ రైటర్, ఎలక్ట్రిక్ పెన్, గ్రామ్ ఫోన్, మోషన్ పిక్చర్ కెమెరా, ఇలాగ ఎన్నింటినో ఆయన తయారు చేశారు. 1931న చనిపోయేంతవరకు సరికొత్త ఆవిష్కరణలకై ఆయన చాలా ఆరాటపడ్డారు. ఊహాశక్తితో సృజనాత్మకమైన ఆలోచనలతో ఎంతో సాధించవచ్చని ఎడిసన్ నిరూపించారు. ఆయన చనిపోయే నాటికి ఆయన ఆస్తుల విలువ లెక్క కట్టగా 2,500 కోట్ల డాలర్లని తేలింది.
కాబట్టి ఊహాశక్తికి, సృజనాత్మకమైన ఆలోచనలకు, ప్రతి విషయాన్ని పరిశీలించటం. ప్రశ్నించటం వంటి వాటివల్ల ఎన్ని అద్భుతాలు చేయవచ్చో తెలుసుకొన్నారు. కదూ.. కాబట్టి మీకున్న సమయంలో కొంత సమయాన్ని సృజనాత్మకమైన పనులకు, ఆలోచనలకు వినియోగిచండి. మీరు ఒక పరిశోధకుడు, బాల శాస్త్రవేత్త అయి తీరుతారు. మీ ఆలోచనలకు పదును పెట్టండి.