నీల్స్ బోర్ (1885-1962)
దేశం: డెన్మార్కు
జననం: అక్టోబర్ 7, 1885, కోపెన్ హాగెన్
పురస్కారాలు:
1) రాయల్ డేనిష్ అకాడెమీ నుంచి స్వర్ణ పతకం.
2) భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (1922)
3) ‘Ford Atoms for Peace’ (1957)
ముఖ్య రచనలు:
1) Theory of Spectra and Atomic Constiution (1924)
2) Atomic Theory and Description of the Naure (1934)
3) Atomic Physics and Human Knowledge (1959)
పరమాణు నిర్మాణ శిల్పి
ఇరవయ్యో శతాబ్దపు తొలిరోజుల్లో ఒక అనూహ్యమైన భావనతో ఆవిర్భవించిన క్వాంటమ్ సిద్ధాంతం భౌతిక శాస్ర్తాన్ని మేలుమలుపు తిప్పింది. దాని ఆధారమైన క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం సూక్ష్మ జగత్తును అర్థం చేసుకోవడానికి ఎంతైనా ఉపకరిస్తుంది. నేటి ట్రాన్సిస్టర్, సిలికాన్ చిప్, న్యూక్లియర్ ఎనర్జీ ఈ శాస్త్ర పరిశోధన ఫలితాలే. మన రోజువారీ జీవన సరళిలో, దృక్పథంలో క్వాంటమ్ సిద్ధాంతం ఎన్నో మార్పులు తెచ్చింది. దీన్ని ఇంతగా అభివృద్ధి పరచిన శాస్త్రజ్ఞులలో ప్రముఖుడు నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్. అణు, పరమాణు నిర్మాణాలను వివరించడానికి తొలిసారిగా సాంప్రదాయక యాంత్రిక శాస్త్రాన్ని, క్వాంటమ్ సిద్దాంతాన్నీ అనుసంధానించిన రూపశిల్పి ఈయన.
బోర్ పరమాణు నమూనా
నీల్స్‌బోర్ పరమాణువుకు గ్రహాల నమూనాను ప్రతిపాదించాడు. సూర్యుని చుట్టూ గ్రహాలు నిర్థిష్ట కక్ష్యలో ఎలా పరిభ్రమిస్తున్నాయో అలాగే ఎలక్ట్రాన్లు పరమాణు కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తున్నాయని ఆయన భావన. ఎలక్ట్రాన్లు స్థిర కక్ష్యలో పరిభ్రమిస్తున్నప్పుడు శక్తిని కోల్పోవు. ఎక్కువ శక్తిగాల కక్ష్య నుంచి తక్కువ శక్తి గల కక్ష్యలోకి దుమికినప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్ కాంతిరూపంలో శక్తిని వికిరణం చేస్తుంది. ఈ శక్తి వికిరణం అవిచ్చిన్నంగా కాకుండా విడివిడిగా ప్యాకెట్ల రూపంలో ఉంటుంది. ఒక ప్యాకెట్ శక్తి లేక క్వాంటమ్‌ను పోటాన్ అంటారు. జర్మన్ భాషలో క్వాంటమ్ అంటే చిన్న ప్యాకెట్ అని అర్థం. బోర్ నమూనా హైడ్రోజన్ విజయవంతంగా వివరిస్తుంది.
ముఖ్య భావనలు
ఎ) ఒక మూలాకాన్ని వేడిచేస్తే అది ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాంతిని వెదజల్లుతుంది. ఈ కాంతిని గోజు పట్టకం కుండా ప్రసరింపచేస్తే ఉత్పన్నమయ్యే వర్ణపటం ఆ మూలకానికి వేలిముద్ర లాంటిది. విశ్వంలో ఎన్ని మూలకాలున్నా దేని వర్ణపటం దానిదే. వర్ణపటాలను బట్టి మూలకాలను కచ్చితంగా గుర్తించవచ్చు.ఈ శాస్త్రాన్ని వర్ణపట విజ్ఞానం అంటారు.
బి) పరమాువులోని ఎలక్ట్రాన్లు ఒక కక్ష్య నుంచి మరో కక్ష్యకు గెంతుతాయన్న బోర్ సిద్ధాంత ఆధారంగా హేరీ మోస్లే అనే శాస్ర్తజ్ఞుడు యక్స్ కిరణాల వర్ణపటాలను అధ్యయనం చేసి ఆవర్తన పట్టికలోని మూలకాలకు ఒక నిర్థిష్ట క్రమాన్ని ఏర్పరిచాడు.
సి) న్యూక్లియస్‌కు ద్రవ బిందు నమూనాను 1934లో నీల్స్‌బోర్ ప్రతిపాదించాడు. ఈ నమూనా కేంద్రక విచ్చిత్తిని అవగాహన చేసుకోవడానికి ఎంతో ఉపకరిస్తుంది. కానీ బోర్ ఈ సూత్రంపై పనిచేసే అణ్వస్త్రాల నిషేదానికి తన జీవితకాలం కృషి చేశాడు.
డి) పూరక భావన : బోర్ ప్రతిపాదించిన ఈ భావన ప్రకారం ఉపపరమాణు వ్యవస్థలో తరంగ, కణ నమూనాల రెండింటినీ స్వీకరించాలి. ఒక దృగ్విషయాన్ని వివరించడానికి ఈ రెండింటి అవసరం ఎంతైనా ఉంది. ఈ భావన స్వేచ్ఛా సంకల్పాన్ని, మౌళికమైన జీవ విధానాల వివరణకు తోడ్పడుతుంది. బహుళ విశ్వాల సిద్ధాంతాలను విశ్లేషించడానికి ఉపకరిస్తుంది. బోర్ ప్రతిపాదించిన ఈ భావనను కోపెన్ హాగెన్ భాష్యం అంటారు.
ఆలోచనలు, అనుభవాలు
1) నీల్స్ బోర్‌ను గురించి ఐన్స్టీన్ ఇలా అంటాడు – నీల్స్ బోర్ లేకుండా పరమాణువును గురించిన మన విజ్ఞానం ఎలా వుండేదో ఊహించలేము. జీవితమంతా ఎంతో తపనతో పరిశోధిస్తున్న వ్యక్తిగా ఆయన తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తాడు. అంతే తప్ప సంపూర్ణసత్యాన్ని ఎప్పుడో కనుగొన్నానన్న ధీమాతో మాత్రం కాదు.
2) కణభౌతిక శాస్ర్తాన్ని గురించి నీల్స్ బోర్ వ్యాఖ్యలు – మన మంతా ఈ శాస్ర్త సిద్ధాంతం క్రేజీగా వుందని ఒప్పుకొంటున్నాం. కానీ మనలో విబేదాన్ని సృష్టించే ప్రశ్న ఏమిటంటే ఈ సిద్ధాంతం నిజమయ్యే అవకాశం వున్నంత క్రేజీగా వుందా… అని.
3) నీల్స్‌బోర్ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడే కాకుండా ఉత్తమ క్రీడాకారుడు. స్కీయింగ్ క్రీడ, పడవ పందాలలో నిష్ణాతుడు. విద్యార్థి దశలో డెన్మార్క్ తరపున పుట్‌బాల్ క్రీడల్లో పాల్గొన్నాడు. 1960లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలలో పాల్గొనడానికి భారత్ వచ్చినప్పుడు మనదేశంలోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించాడు.