పడిసి పలుకులు పిల్లల పాటలు
వేకువమ్మ లేచింది
తూరుపు వాలికి తెరిచింది
గగడపకు కుంకుమ పూసింది
బంగరు బిందె తెచ్చింది
ముంగిట వెలుగు చల్లింది
ఆ వేకువ పేరు జై సీతారాం. ఆయనచల్లిన వెలుగులు.. బాలల గేయాలు. నీలాల నింగిలోన ఏడురంగుల బాలల జెండా ఎగరేసిన ఏకోపాధ్యాయుడు సీతారాం.బట్టీ చదువులనే చుక్కల నడుమ చిక్కిన జ్ఞానమనే చందమామ మీదకు చిన్నారులను చేర్చడానికి అపోలో వ్యోమనౌకల్లాంటి గేయాలను కూర్చిన వ్యక్తి ఆయన.
కుటుంబ బంధాలు, భావాలు, పండుగలు, కాలాలు, కొలతలు, లోహాలు, ఆటలు, పక్షులు, జంతువులు, రంగులు, రుచులు, శబ్ధాలు, అక్షరాలు, కారణాలు, కార్యకారణాల నుంచి చరిత్ర, భూగోళశాస్త్రం, సామాజిక అంశాల వరకూ రచనా వస్తువు ఏదైనా కావొచ్చు! పిల్లలకు గేయం అర్థమైతే చాలు.. అది వారిలో ఊహాశక్తిని, పరిసరాల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ప్రేమించే తత్వాన్ని నేర్పుతుంది. విజ్ఞానఖనుల్లా తీర్చిదిద్దుతుంది. అలాంటి మేలిమి ముత్యాల్లాంటి గేయాలనే రాశారు. “జై సీతారాం” అవి చిన్నారుల్లో చదవాలన్న తపన పెంచుతాయి. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయి.
పిల్లలు బళ్లోగానీ, ఇంట్లోగానీ మొదటగా చిట్టిచిలకమ్మ గేయాన్ని వల్లె వేస్తారు. అదెంతో ప్రాచుర్యం పొందినప్పటికీ అంతకంటే గేయాలు మనకు లేవాఅనిపిస్తుంది.పిల్లల పాటలు, గేయాల పేరుతో ఎంతో మంది ఎన్నో రాశారు. కానీ అవన్నీ తరగతి గదిలో ఉపాధ్యాయులు, పిల్లలు తేలికగా పాడుకునేలా ఉండవు. ఆ కొరతను జై సీతారామ్ గేయాలు తీరుస్తాయి. దాదాపు నూటయాభై వరకు ఆయన రాసిన బాలల గేయాలు ఎంతో సృజనాత్మకంగా,.లయబ్ధంగా,. సులువుగా, రాగయుక్తంగా ఆలపించేలా ఉంటాయి. అవి పిల్లల హృదయాలకు హత్తుకుని వాళ్లనుఆనంద పరవశుల్ని చేస్తాయి. జై సీతారాం గేయాలు రాయడమే కాదు, పిల్లలతో ఆడి పాడారు. వారి మనసులను దోచుకుని అనుభూతిని పొందిన అనుభవాల సారాన్నిఅక్షరీకరించి మేం పిల్లలం అంటూ ఓ పుస్తక రూపాన్నిదాల్చారు.
పిల్లల మనోభావాలను తెలుపుతూ ఆయన రాసిన ఈ చిట్టి గేయాన్ని చూడండి..
అద్దంలో ఎవరమ్మ ముద్దు మొగం బొమ్మా?
నే నెట్లు దువ్వితే తానెట్లె దువ్వు!
నేనెట్లు నవ్వితే, తానట్లె నవ్వు!
పిల్లకు ఇష్టమైన వస్తువుల్లో అద్ధం ఒకటి. కళ్లజోడు, టోపీ, దుస్తులు. వాటిని వేసుకొన్నప్పుడు వారి కళ్ళలో ఆనందం, గర్వం తొణికిసలాడుతుంది. అలాంటి ఒక భావనను జై సీతారాం పై గేయంలో హృద్యంగా చిత్రీకరించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబితే పిల్లలు వింటారా? దాన్నే అందమైన గేయ రూపంలోకి మార్చి చెబితే.. కచ్చితంగా వింటారు. సీతారం అదే పని చేశారు.
ఈగా! ఈగా! వెళ్లిపో! ఇల్లు విడిచి వెళ్లిపో!
సుబ్బరంగ నువ్వుంటే చెప్పకుండ వెళతా!
దోమా! దోమా! వెళ్ళిపో! దూరంగా వెళ్ళిపో!
మురుగు నీరు లేకుంటే తిరిగైన చూడను!
బాలల దినోత్సవం నాడే…
చిన్నారుల కోసం అలతి అలతి పదాలతో, పొందికైన బావాలతో ఇంత చక్కటి గేయాలను రాసిన జై సీతారాం… అనంతపురం జిల్లా కోగిర గ్రామవాసి. గౌని ఓబుల్ రెడ్డి, చెన్నమ్మ దంపతులకు 1924 నవంబర్ 14న జన్మించారు.కూనపురం, నడిపల్లి, బొంతలపల్లి, కోగిర, రామగిరి తదితర ప్రాంతాలలోని పిల్లలకు 1949-85 మధ్యకాలంలో విద్యాబుధ్దులు నేర్పించారు. 1983లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాన్నందుకున్నారు. 1984-85 విద్యా సంవత్సరానికి రెండో తరగతి వాచకాన్ని అందించారు. ఎక్కవ కాలం ఒకటో తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగాపని చేయడంతో.. పసిపిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. వారికి సులువైన పద్ధితిలో బోధన చేయడానికి గేయాలనురాసి, పాడేవారు. ఉపాధ్యాయుణ్ని చూసి పిల్లలు భయపడకూడదు. ఆటపాటలతో వారికి తగ్గరవ్వాలి. వారి మనస్తత్వాలను తెలుసుకుని చదువు చెప్పాలి. అదే నా లక్ష్యం అని చెప్పేవారాయన. అందుకుతగ్గట్టుగానే గేయ రచన చేశారు.
యాభైయ్యారక్షరా తెలుగు వర్ణమాలతో చిన్నారులకు దోస్తీ పెంచడానికి చక్కటి గేయం రాశారు. సీతారాం.
అఆఇఈ నేర్పండి అయ్యవారూ!
హక్షదంక అక్షరాలు యాభైయ్యారూ!
ఎక్కడ? ఏవీ? ఎఏఐ
ఒహో! ఓహక్ష! ఒఓఔ
అం మమ్మమ్మమా! అః హహ్హహ్హ!
ఇలా సాగే గేయం పాడుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుంది అక్షరాలే కాదు, ఒత్తులు, సర్వనామాలు, పోలికలు జైసీతారాం గేయాల ద్వారా పిల్లలు సలభంగా నేర్చుకుంటారు. అలాగే రంగులు, రుచులు, అంకెలు కూడా అన్యాపదేశంగా ఒత్తులను నేర్పే గేయమిది.
అక్కా! పెట్టు చుక్కా! బొట్టు!
అవ్వా! నాకు బువ్వా పెట్టు!
అమ్మా! నాకు బొమ్మా ఇవ్వు!
నాన్నా! నాకు పెన్నూ ఇవ్వు !
అలాగే రుచులను తెలుపుతూ అరటిపండు తీపు! ఆదివారం రేపు! రంగులను వివరిస్తూ కాకమ్మ నలుపు! కారు మబ్బు నలువు! జంతువుల అరుపులను అనుకరిస్తూ పిల్లి పిల్లి! ఏమంటావ్ – మ్యావ్! మ్యావ్! మ్యావ్! లాంటి గేయాలు జై సీతారాం కలం నుంచి జాలువారాయి. పిల్లి పిల్లి గేయాన్ని తరగతి గతిలో ఆయన పాడుతుంటే పిల్లలు శ్రుతి కలిపేవారు. దాంతో పరిసరాలంతా పిల్లలు, కుక్కలు, ఆవుల అరుపులతో మారుమోగేవి. చిన్నారులకు ఆకట్టుకునే బోధనా శైలి ఇది అలాగే వాయిద్యాల శబ్ధాలను తెలిపే తప్పిట కొడితే ఢం! ఢం! ఢం! వంటి గేయాలను రాగయుక్తంగా, భావ యుక్తంగా పాడినప్పుడు పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. ఈ గేయాల ద్వారా పిల్లల్లో ఒక కొత్త వెలుగును, ఆనందాన్ని చూస్తాం. రకరకాల వృత్తుల మీద ఆయన రాసిన గేయం ఎంతో మంది పనివాళ్ళు దగ్గర నుంచి వారాలు, ఆటలు, పనిముట్లు బంధుత్వాలు-అనుబంధాలు పిల్లల బాధ్యతలు.. ఇలా ఆయన సృజించని అంశం లేదు. చెప్పుకుంటూ పోతే ప్రతి గేయం ఒక ఆణిముత్యమే. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో మాతృబాషపై మమకారం పెంచడానికి రాసిన గేయమైతే మేలిమి మౌక్తికమే.
ఐతే మాత్రం మరువం! మరువం!
మాతృబాష మధురం
అమ్మా అంటు అమృతం ఒలికే
కమ్మని పలుకే పలకండీ!
వెన్న మాటనే వాడండీ!
అమ్మా! అమ్మా! నాన్నా! నాన్నా!
అమ్మా! అమ్మా! నాన్నా! నాన్నా!
ఎలాంటి సంగీత పరిజ్ఞానమూ లేని వారైనా సులభంగా, భావయుక్తంగా పాడుకోగల గేయాలివి. ఆయన రాసిన గేయాలన్నింటినీ సంకలనం చేసి టింబక్టు కలెక్టివ్ వారు మేం పిల్లలం పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. బాలల గేయాలతో పాటు జై సీతారాం…
అక్షర సైన్యం, నిట్టూర్పులు తదితర ఉద్యమ సాహిత్యం., జైసీతారాం సీసాలు పేరిట వివిధ అంశాలపై సిసా పద్యాలు, నాటికలు రాశారు. సీతారాం చేయి తిరిగిన రచయితే కాదు.. తబలా, హార్మోనియాలను వాయించడంలో దిట్ట. మంచి చిత్రకారుడు కూడా. తన గేయాలకు తానే బొమ్మలేసుకునే వారు. బాలసాహిత్యం పిల్లలకు అర్థమయ్యే భాషలో ఉండాలసని చెప్పే జై సీతారాం తన రచనలో ఆ ప్రమాణాలనే పాటించారు. చిన్నారుల సర్వతో ముఖాభివృద్ధికి అక్షరం ఆలంబన కావాలని కోరుకున్న ఆయన అక్టోబర్ తొమ్మిది, 2000న లోకాన్ని విడిచి వెళ్లారు.
ప్రతి ప్రాధమిక పాఠశాలలో ప్రతి ప్రాథమిక ఉపాధ్యాయుని వద్ద, చిన్న పిల్లలున్న ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం మేం పిల్లలం. భాషాభివృద్ధికి సృజనాత్మకత పెంపునకు ఎంతో దోహదపడే ఈ గేయాలను పిల్లలకు తప్పక పరిచయం చేయాలి. మనం కూడా అలాంటి గేయాలను రాయాలని, కొత్తదనం చూపాలనే స్పూర్తిని పిల్లల్లో కలిగిస్తాయని, అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం. అని సాధారణ పదాలతో శ్రీ శ్రీ.. కవితలకు కొత్త ఉరవడిని సృష్టించినట్లే, బాలల గేయాలకు జై సీతారాం నూతన ఉరవడిని సృజించారు. బాల సాహిత్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని దాన్ని చిన్నారుల నేస్తంగా మలచడమే మనం ఆయనకు ఇచ్చే నివాళి.