మానవుడికి మేలు చేసే సాలీళ్ళు

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

మానవుడికి మేలు చేసే సాలీళ్ళు

 మీరంతా స్పైడర్ మాన్ కార్టూన్ ఫిల్మ్, స్పైడర్ మాన్ సినిమాలు చూసి వుంటారు. తన స్నేహితులు, లేదా ఇతరులు ఎవరైన ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటాడు. స్పైడర్ మాన్, అంతేకాదు తన పట్టుదారాలతో శత్రువులను బంధించటం, ఎత్తయిన బిల్డింగ్ లను సునాయాసంగా ఎక్కేయటం, అంత ఎత్తుల నుంచి  దూకటం మీరంత చూసే వుంటారు. అయితే మన సాలీళ్లు కూడా ఈ సహసాలన్నీ చేస్తాయని గమనించారా.. సాధారణంగా మన ఇళ్ళల్లో, పెరట్లో రెండు రకాల సాలె పురుగులను గమనిస్తాం. చిన్న సాలె పురుగులు, పెద్ద కాళ్ల సాలె పురుగు. అవిసాధారణంగా గోడల మూలల్లో, అటకల్లో గూళ్లు కట్టుకొంటాయి. చాలామంది సాలీళ్ళను బూజును చూసి, భయపడటమేకాక అసహ్యించుకోవటం చేస్తుంటారు. అయితే ఇవి మాత్రం మానవుడుకి ఎంతో మేలు చేస్తున్నాయి. ఇవి గూళ్ళను కట్టుకొని క్రిమికీటకాలను వాటి గూళ్లలో బంధించి వాటిని ఆహారంగా తీసుకొంటూ మనకు ఎంతో మేలు చేస్తున్నాయి.

సాలీళ్ళు పురాతమైన అరాన్సిడె వర్గానికి చెందిన కీటకాలు. పొలాల్లో, ఇళ్ళలో అనేక వందల సాలీళ్ళు మన మీదకు దాడి చేయబోయే అనేక క్రిమి కీటకాలను నాశనం చేస్తున్నాయి. ఇలా సాలీళ్ళు మనకు ఉపకారం చేయకపోతే మానవుడు ఆ క్రిమి కీటకాల వల్ల ఎన్నో దుష్ర్పభావాలకులోను కావాల్సివచ్చేది.

అయితే ఇంట్లో అమ్మలకు మాత్రం వీటిని చూస్తే విసుగు, చిరాకు, వారానికొకసారి బూజులు దులపాల్సి వస్తుందని బూజు దులిపి వాటిని చంపే ప్రయత్నం చేస్తుంటారు. అయితే అవి మాత్రం అలుపెరుగని వీరుల్లాగా గోడలమీద పాకుతూ గూళ్ళను కడ్తూనే వుంటాయి. మీరు కూడా వాటిని చంపటమో, చిన్నసాలీడు పట్టుదారం పట్టుకొని దానితో ఆడటం చేస్తూంటారు. కదా… అయితే ఇలా చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ప్రాణాంతక క్రిమి కీటకాలను నాశనం చేస్తూ ఎంతో మేలు చేస్తున్న ఎంతో అందంగా గూడు కట్టుకొనే ఈ ఆర్కిటెక్ట్ ను చంపేముందు ఒక్కసారి ఆలోచించండి.

పొలాల గట్ల మీద, చెట్ల మధ్య మైదానాల్లో, సూర్యోదయ సమయాలలో వాటి గూళ్ళని చూస్తే మంచుతుంపర్లు వాటి మీద పడి మెరుస్తూ మనకు ఎంతో అందంగా కనపడటం చూస్తాము. బ్రిటన్లో ఒక ప్రకృతి శాస్ర్తవేత్త ఒక ఎకరా పొలంలో సాలీళ్ళను లెక్కిస్తే వాటి సంఖ్య 2,265.000లుగా ఉన్నాయట. మరి అవి మన పొలాల్లో సైనికుల్లాగా ఎంతగా కాపలా కాస్తున్నాయో చూశారా… మానవుడి మనుగడ సాలీళ్ళు లేకుండా వుంటే ఊహించటం కష్టమౌతుంది.

సాలీడు దారాలు – సాలీడు గూళ్ళు

సాలీళ్ళు తయారు చేసే పట్టు దారాలు, అవి అందంగా కట్టే గూళ్ళు. ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమని చెప్పవచ్చు. సాలీడుకు కావాల్సిన దారం అదే తయారు చేసుకుంటుంది. సాలీడు శరీరంలో ఉండే జన్యువు ఈ దారం తయారీకి తోడ్పడుతుంది. కానీ ఈ వారం తయారయ్యే ముందు సాలీడు కడుపులోని తిత్తులలో ద్రవరూపంలో ఉంటుంది. బయటకు రాగానే వెంటనే గట్టి పడుతుంది. ఈ రహస్య మేమిటో శాస్ర్తజ్ఞులకు అంతు చిక్కటం లేదు. ఈ దారం ఎంత బలమైనదంటే అదే వ్యాసార్థంలో స్టీలు కన్నా అధిక శక్తి కల్గి వుంటుంది. అంతే కాకుండా దీనికి సాధారణ పొడవు కన్నా 25 రెట్లుసాగి గుణం (నైలాన్ థ్రెడ్స్ కన్నా ఎక్కువ) వుంటుంది. సాధారణంగా అన్నీ సాలీళ్ళకు మూడు జతల నిపిల్ ఆకారంలో పొట్ట క్రింద భాగంలో “స్పిన్నరెట్స్” ఉంటాయి. సిల్క్ గ్లాండ్స్ నుండి ఈ స్పిన్నరెట్స్ ద్వారా ఈ సిల్క్ దారం వెలుపలికి వస్తుంది. అయితే విచిత్రమైన విషయమేమిటంటే ఈ మూడు జతల నుండి ద్రవ రూపంలో వెలువడే శిల్కుదారం వెంటనే అన్నీ ఒకటిగా కలిసిపోయి ఒకే పోగు ఏర్పడుతుంది. ఇవి ఈ గూళ్ళను ఏర్పరచుకొనేది ముఖ్యంగా ఆహారం కోసమే. ఇవి ఇతర కీటకాలకు బోనుల్లాగా పనిచేస్తాయి. ఈ సాలీడు పట్టుదారాలకు అతినీలలోహిత కాంతిని పరావర్తనం చెందించే గుణం ఉంది. కీటకాలు ఈ కాంతి సూర్యుడినుండి వచ్చేవని భ్రమపడి సాలీడు వలలో చిక్కుకుంటాయి.

ఇది ఈ గూడు కట్టుకొనే విధానమే విచిత్రంగా వుంటుంది. దీనిని స్పైడర్ వెబ్ అంటున్నాం. అయితే అన్నీ సాలీళ్ళు ఈ గూళ్ళ్‌ను కట్టుకోవు. ఈ శిల్క్ దారాలన్నింటికీ అతుక్కునే గుణం వుంటుంది. క్రిమి, కీటకాలు, వీటిని అతుక్కుంటాయి. అయితే ఇవి ఎంత తెలివైనదంటే ఆగూడు కట్టుకొనేటప్పుడు కొన్ని దారాలను అతుక్కునే గుణం లేకుండా అవి సులభంగా నడిచే విధంగా పొడిగా ఉండేటట్లు చేసుకొంటాయి. కొన్ని రకాల కీటకాలు ఈ గూళ్ళలో ఇరుకొని గిలగిలా కట్టుకొని తప్పించుకొంటాయి. అది కూడా సాలీళ్ళకు లాభమే. ఎందుకంటే వాటి కాళ్ళకున్న పుప్పొడిని అవిరాలుస్తాయి. ఇంక అప్పుడు వాటికి వింధు భోజనమే. ఇది గూడంతా కట్టుకున్న తర్వాత ఒక టెలిగ్రాఫ్ లాంటి దారపు పోగును గూడు మధ్య నుంచి వెలిపలి దాకా నిర్మించుకొంటుంది. ఏదైనా కీటకం గూడును తాకగానే వెంటనే పోగు ద్వారా సంకేతాలు అందిపోతాయి. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి ఆ కీటకాన్ని పట్టుకుంటాయి.

సాలీడు సిల్క్ దారం మీద శాస్ర్తజ్ఞులు అనేక ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. సాలీడు శిల్క్ దారాన్ని తయారు చేసే జన్యువు లాంటిదాన్ని బాక్టీరియాల్లోకి ఎక్కించి శిల్క్ దారాన్ని తయారు చేశారు. అయితే దాని ఘన రూపంలోకి మార్చటానికి రహస్యం మాత్రం అంతు చిక్కలేదు. సాలీడు దారాలనుపయోగించి బుల్లెట్ ఫ్రూఫ్ దుస్తులు తయారు చేస్తున్నారు. ఈ దారాలు స్టీలు కన్నా గట్టిగా వుంటాయి. రబ్బరులాసాగే గుణం కలిగి వుంటాయి. వైద్యరంగంలో కొన్ని కండర సంబంధిత నిర్మాణాలను కృత్రిమంగా ఈ దారంతో నిర్మిస్తున్నారు. ఎందుకంటే వీటికి మృదుత్వం కూడా వుంటుంది. సాలీడు దారం నీటిలో కరగదు. సాలీడు గూడు  లేదా దారపు పోగులు ఏదైనా కీటకం ఢీ కొన్నప్పుడు తక్కువ వేగంతో కదలగలిగి ఎక్కువగా గాలిలో ఘర్షణకు లోనవుతాయి. దీన్ని ఆధారంగా చేసుకొని విమానాశ్రయాలలో, స్టేడియాలలో వేగంగా వచ్చే వస్తువులను ఈ దారాల నెట్‌తో ఆపవచ్చని శాస్ర్తజ్ఞులు భావిస్తున్నారు.

సాలీడు విషం

సాధారణంగా సాలీళ్ళు మానవునికి ఏ హాని కలుగ జేయవు. తన గూడులో ఇరుక్కొన్న క్రిమి కీటకాలపై ఈ సాలీళ్ళు ఒక రకమైన విషాన్ని చిమ్ముతాయి. దాని ప్రభావం క్రిమి కీటకాల మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్ మీటర్ పై పనిచేస్తుంది. అందువల్ల అవి షాక్‌ కు గురయ్యి ఆచేతనంగా వుండిపోతాయి. అప్పుడు దాని నుండి ద్రవ రూపంలో ఆహారాన్ని గ్రహిస్తుంది. అయితే ఈ విషం స్వజాతి మీద పనిచేయదు. అంటే వీటి రక్తంలో విషానికి విరుగుడు ఉందని తెలుస్తుంది. సాలీడులో ఉండే విషాన్ని కృత్రిమంగా తయారు చేయగల్గితే శక్తివంతమైన కీటక నాశన మందు తయారైనట్లేనని శాస్ర్తజ్ఞులు భావిస్తున్నారు.

సాలీళ్ళు ఇరవైరెండు వేల అడుగుల మౌంట్ ఎవరెస్ట్ మీద జీవించగల్గుతాయి.రెండు వేల అడుగున గల గుహల్లోను జీవించగలవు.

సాలీళ్ళకు మొదటి శత్రువులు, చీమలు. వాటి నుండి తప్పించుకోవటానికి కాళ్ళను పైకెత్తి ఎంటెన్నాలాగా పని చేస్తుంది. సాలీళ్ళు కొన్ని రకాలు, రెండు లేదా మూడు గుడ్లను పెడుతాయి. కొన్ని రకాలు మూడు వేల వరకు గుడ్లు పెడుతాయి. సాధారణంగా సాలీళ్ళు రెండు వందల అడుగుల నుంచి పద్నాలుగు వేల అడుగుల ఎత్తు వరకు ప్రాకి పోగలవు. బ్లాక్ విడో అనే సాలీడు రాటిల్ స్నేక్ కంటే పదిహేను రెట్లు అధికంగా విషం చిమ్ముతుంది.

మీ ప్రాంతంలో ఉండే సాలీడ్లను పరిశీలిచండి. భూతద్ధం సహాయంతో శరీర నిర్మాణాన్ని పరిశీలించండి. అవి గూడు కట్టే విధానాన్ని పరిశీలించండి. ఏయే ప్రాంతాలలో ఎక్కువగా ఉంటున్నాయో గమనించండి. వాటి వైవిధ్యాలను గమనించండి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *