లిటిల్ “మౌస్” సృష్టికర్త

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

లిటిల్ “మౌస్” సృష్టికర్త

మౌస్ లేకుండా కంప్యూటర్‌ను ఒకసారి ఊహించుకోండి 1981దాకా కంప్యూటర్లు మౌస్ లేకుండా కేవలం కీ బోర్డు సహాయంతో అన్నీ కమాండ్లతోటి ఆపరేట్ చేయాల్సి వచ్చేది. అయితే కంప్యూటర్‌కు అత్యంత ఉపయోగకరమైన మౌస్ శాస్త్రవేత్తను గూర్చి చాలా మందికి తెలియదు. ఆయన పేరు డగ్లస్ ఇంగిల్‌ బర్డ్ మాక్ (ఆపిల్) కంప్యూటర్ మొట్టమొదటగా విండోస్ తో ప్రారంభించి కంప్యూటర్ రంగాన్ని మలువు తిప్పితే డగ్లస్ మౌస్‌ను కనుగొని కంప్యూటర్‌కు కొత్త రూపాన్ని తెచ్చారు.

డగ్లస్ 1925లో పోర్ట్ లాండ్‌లో జన్మించారు. ఓరగాన్ విశ్వ విద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తిచేసి 1942లో కాలిఫోర్నియాలోని ఎలక్ట్రానిక్స్ విభాగంలో చేరారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పి.హెచ్ డి పొంది స్టాన్‌ఫర్డ్ రీసర్చి ఇనిస్టిట్యూట్లో చేరారు. అక్కడ నుండే ఆయన పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఆయన మౌస్ తయారు చేయాటనికి పడిన తపన ఆయన మాటల్లోనే చూద్ధాం!

“ఆ సమయంలో 17 మంది టీమ్ సభ్యులం ఉండేవాళ్ళం. కొత్త టెక్నాలజీ కనుగొనాలని అందిరకీ ఉత్సాహంగా ఉండేది. మొదట్లో పెద్ద బాల్ వంటి పరికరాన్ని తయారు చేశాం. దాన్ని కదిపితే కొన్ని ఆదేశాలు అందేవి. అదే విధంగా ఒక లైట్ ప్యానల్‌ను తయారు చేశాం. ఇవన్నీ ప్రాక్టికల్‌గా ఉపయోగపడవని తేలిపోయింది. దీనితో కొత్త ఐడియా ఆలోచించాల్సి వచ్చింది”.

అప్పుడు కంప్యూటర్ టేబుల్‌పై కదిలేందుకు వీలుగా ఉండే సాధనాన్ని తయారు చేయాలనే ఆలోచన ఆయనకు కల్గింది. డిసెంబర్ 9, 1968లో ఒక సమావేశంలో ఆయన తన ప్రతిపాదనలను వుంచారు. అప్పుడు దానికి అంత స్పందన కనిపించలేదు.

“ఆ సమావేశం చాలా నిరుత్సాహ పరచింది. ఇటువంటి సాధనాన్ని ఆఫీసులో మీరు వాడుతారా అని అడిగితే ఎవ్వరూ పెద్ద ఉత్సాహం చూపలేదు. పైగా నన్ను కుష్టుగ్రస్తుణ్ణి చూసినట్లు చూశారు. ” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

20వ శతాబ్ధంలో కూడా ఆయన ఇటువంటి అవమానాల్ని చవిచూశారంటే ఆశ్చర్యం కల్గుతుంది. అయితే దురదృష్టకరమైన విషయమేమిటంటే మౌస్ పేటెంట్ హక్కులు ఆయన పేరు మీద లేకపోవటం. అప్పట్లో పేటెంట్ వ్యక్తుల పేరు మీదగా చేసేవారు కాదు. అందువల్ల“ స్టాన్‌ఫర్డ్ రీసర్చి ఇనిస్టిట్యూట్” వారు దాని మీద పేటెంట్ రిజిష్టర్ చేసుకున్నారు. దీని పరిశోధనలకు గాను ఆయనకు ముట్టింది. కేవలం 10వేల డాలర్లు మాత్రమే. ఈ విషయంలో ఆయన ఔదార్యాన్ని తెలుసుకుందాం.

“నా దృష్టి ఎప్పుడూ పేటంట్ల మీద లేదు. మనం ప్రపంచాన్ని ఏ విధంగా మార్చగలం అని ఆలోచిస్తూ ఉండేవాడిని. సంక్లిష్టమైన సమస్యలు అనేకం ఉన్నాయి. వాటికి పరిష్కారం కనుగొనటం ఎలా.. అనేది నా ఆలోచన”.

ఎందరో వ్యక్తులు, కంపెనీలు కొన్ని వస్తువులపై గుప్తాధిపత్యం కలిగి కోట్లు గడిస్తుంటే తన పరిశోధనలు ప్రపంచానికి ఉపయోగపడాలని భావించే ఇలాంటి శాస్త్రవేత్తలకు మనం పాదాభివందనం చేయాల్సిందే..

ఆ తర్వాత పదేళ్ళకు అంటే 1981 ఏప్రెల్ 27నవ తేదీన జెరాక్స్ స్టార్ 8010 అనే పేరుతో తొలి మౌస్ మార్కెట్లో విడుదల అయ్యింది. ఆ తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ (O.S) విండోస్తోపాటు మౌస్ కూడా కల్గిన మాక్ (ఆపిల్) కంప్యూటర్లను మార్కెట్లో విడుదల చేశారు. ఇప్పుడు మౌస్ మోడల్స్‌లో సాప్ట్‌వేర్‌లలో, డిజైన్లలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇంకా కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి. మౌస్ అవశ్యకత పెరుగుతూనే వుంది.

మొదట్లో మౌస్ పేరు ఎక్స్-వై పొజిషన్ ఇండికేటర్  అని పెట్టారు. ఈ పేరు పిలవటం కష్టంగా ఉందని దీనికి ఏదైనా పొట్టి పేరు పెట్టాలని డగ్లస్ బృందం సభ్యులు ఆలోచించారు. డగ్లస్ బృందంలోని సభ్యుడు ఒకరు సరదాగా దీనికి తోక ఉంది అటు ఇటు కదులుతుంది కాబట్టి మౌస్ అందాం అన్నారు. అంతే ! ఆ సరదా పేరే మౌస్‌గా స్థిరపడి పోయింది. అంతేగాని దీనికి ఎలకకు ఏ సంబంధంలేదు. ఆ తర్వాత జాక్ జెల్లి అనే పరిశోధకుడు మౌస్‌ను సులభంగా కదపటానికి ఉపయోగపడే మౌస్ పేడ్‌లను రూపొందించారు.

మౌస్ పితామహుడు 1988లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి రాజీనామా చేసి 1988లో బూట్ స్రా్టప్ అనే కంపెనీని స్థాపించారు. ఆయన మౌస్నే కాక కోరల్ కీ బోర్డ్ ను కూడా రూపొందించారు. ఈ కీ బోర్డు సహాయంతో అక్షరాలను, సంఖ్యలను ఒక చేతితోనే టైప్ చేయవచ్చు. ఆయన ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్ట్స్ ఆండ్ గ్రాఫిక్స్, నెట్ వర్కింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి అంశాలను కూడా అభివృద్ధి పరిచారు.

“నా ఆఖరి శ్వసా వరకు కొత్త విషయాలు నేర్చుకుంటా” అని పలికే డగ్లస్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *